Let's talk: editor@tmv.in
కరీంనగర్ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

కరీంనగర్ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

Gaddamidi Naveen
22 జూన్, 2026

కరీంనగర్-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో సాంకేతిక లోపం కారణంగా బస్సులో మంటలు వ్యాపించాయి.

అయితే, ప్రమాదాన్ని ముందే గమనించిన డ్రైవర్ అత్యంత సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. వెంటనే కండక్టర్‌తో కలిసి బస్సులోని 37 మంది ప్రయాణికులను తక్షణమే కిందకు దించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులంతా దిగిపోయిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేలోపే, బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా, ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. అనంతరం సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ.. డ్రైవర్ గనుక సరైన సమయంలో స్పందించి తమను కిందకు దిగమని చెప్పకపోతే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని, తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తును ప్రారంభించారు.

ట్యాగ్‌లు
TelanganaKarimnagarHyderabadThimmapurLMDRTCBusElectricBusTSRTCBusFireKarimnagarNewsHyderabadNewsBreakingNews
కరీంనగర్ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం - Tholi Paluku