Let's talk: editor@tmv.in
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు 2027 జూన్ నాటికి పూర్తి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు 2027 జూన్ నాటికి పూర్తి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు 2027 జూన్ నాటికి పూర్తి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
11 జూన్, 2026

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన సాంకేతిక రోడ్‌మ్యాప్‌తో ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ప్రాజెక్ట్ సైట్ వద్ద జరుగుతున్న పరిశోధనలు, పరీక్షల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పనులు ప్రారంభించి, 2027 జూన్ నాటికి మేడిగడ్డ బ్యారేజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న హైడ్రోలాజికల్ అధ్యయనాలు, జీపీఆర్ పరీక్షలు, జియోటెక్నికల్ బోర్హోల్ స్టడీస్ వంటి సాంకేతిక పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 80 నుంచి 90 శాతం ప్రాథమిక పరిశోధనలు పూర్తయ్యాయని, మిగిలిన అధ్యయనాలు జూలై మొదటి వారానికి ముగుస్తాయని చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా వివరణాత్మక పునరుద్ధరణ డిజైన్లను రూపొందించి, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ల ఆమోదానికి సమర్పిస్తామన్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే, అంటే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో అసలు పునరుద్ధరణ పనులు ప్రారంభించి, 2027 వేసవి నాటికి బ్యారేజీలను పునరుద్ధరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి విమర్శలు

ఈ విషయంలో రాజకీయం చేయడం తమకు ఇష్టం లేదని, అయితే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక, సాంకేతిక భారాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 38,000 కోట్లతో ప్రణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి, 2014 నాటికే మూడో వంతు పనులు పూర్తి చేసిందన్నారు. దానిని అలాగే కొనసాగించి ఉంటే 2016-17 నాటికే పూర్తయి, 16 లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడంతో వ్యయం రూ. 1 లక్ష కోట్లు దాటిందని, కాగ్ అంచనాల ప్రకారం అది రూ. 1.45 లక్షల కోట్లకు చేరనుందని ఆరోపించారు. ఇంత భారీగా ప్రజాధనం ఖర్చు చేసినా, 2023 డిసెంబర్ 7 నుంచి ఈ మూడు బ్యారేజీలు ఒక్క చుక్క నీటికి కూడా ఉపయోగపడకుండా పోయాయన్నారు. 2023 అక్టోబర్‌లోనే బ్యారేజీలు దెబ్బతిన్నాయని, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలున్నట్లు కేంద్ర సంస్థలు గుర్తించాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ నిపుణులతో పునరుద్ధరణ చర్యలు

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత ప్రభుత్వం జుడీషియల్ కమిషన్, ఎన్డీఎస్ఏల ద్వారా విచారణ జరిపిస్తూనే పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ డిజైన్ల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ 'ఏఫ్రీ' తో పాటు ఐఐటీ బాంబేను నియమించినట్లు తెలిపారు. పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మోడల్ స్టడీస్ చేస్తోందన్నారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సాంకేతిక నైపుణ్యం కలిగిన కల్నల్ పృథ్విరాజ్ మెహ్రాని ‘రివైవల్ కోఆర్డినేషన్ టీమ్’ చైర్మన్‌గా నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.