Let's talk: editor@tmv.in
గుప్త నిధుల వేటలో కాకతీయుల గుడి ధ్వంసం: మాజీ మంత్రి హరీష్‌‌రావు
గుప్త నిధుల వేటలో కాకతీయుల గుడి ధ్వంసం: మాజీ మంత్రి హరీష్‌‌రావు

గుప్త నిధుల వేటలో కాకతీయుల గుడి ధ్వంసం: మాజీ మంత్రి హరీష్‌‌రావు

Gaddamidi Naveen
12 మే, 2026

నర్సంపేట నియోజకవర్గం, ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని కూల్చివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణాన్ని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులతో కలిసి ఆయన సందర్శించారు.

శివాలయ సందర్శన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధి పేరుతో దేవాలయాల విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన “మన ఊరు–మన బడి” కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని, దాని ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాలను నిర్మించిన గత ప్రభుత్వానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు దేవాలయాలను కూడా కూల్చేస్తోందని విమర్శించారు.

అశోక్ నగర్‌లోని కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన ఈ చారిత్రక శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారని ఆయన ఆరోపించారు. ఆలయ రక్షణకు ఉన్న మట్టి ఆనకట్టను తొలిచుకుంటూ వెళ్లి గర్భగుడిని ధ్వంసం చేశారని, రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో చీకట్లోనే గర్భగుడి కింద 24 అడుగుల లోతులో భారీ గుంత తవ్వారని తెలిపారు. స్కూల్ నిర్మాణ పనులు అయితే పగలే చేయవచ్చని, అర్ధరాత్రి తవ్వకాలు గుప్తనిధుల కోసమే కుట్ర జరిగాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పురావస్తు శాఖ అధికారి కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విమర్శించారు. గతంలో ధరణిలో దేవాలయ భూమిగా నమోదైన ఈ స్థలం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతిలో ప్రభుత్వ భూమిగా ఎలా మారిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చుట్టుపక్కల తగినంత స్థలం ఉన్నప్పటికీ ఆలయాన్నే లక్ష్యంగా చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 1958 పురావస్తు చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని, కాబట్టి ఈ స్థలాన్ని వెంటనే పురావస్తు శాఖకు అప్పగించాలని కోరారు. ఆలయ ధ్వంసంపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని, చారిత్రక శివాలయాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

టెండర్లలో రూ. 494 కోట్ల కుంభకోణం

అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 76 స్కూళ్ల టెండర్లను అన్నీ దాదాపు 5శాతం ఎక్సెస్ (అదనపు) ధరకు కట్టబెట్టారని, దీని ద్వారా రూ. 494 కోట్ల ప్రజాధనం లూటీ అయ్యిందని గణాంకాలతో వివరించారు. ముఖ్యంగా నర్సంపేట ప్యాకేజీ-8 కింద రూ. 136 కోట్ల టెండర్‌ను రూ. 142 కోట్లకు కేటాయించారని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.