Let's talk: editor@tmv.in
ఖమ్మం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి..గవర్నర్‌ను కలిసిన కవిత

ఖమ్మం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి..గవర్నర్‌ను కలిసిన కవిత

Panthagani Anusha
27 మే, 2026

వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు, పరిగి మండలం కొల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను లోక్ భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధితులతో కలిసి వెళ్లిన వారు భూసేకరణ, ఇండ్ల కూల్చివేతల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులు, రాయగిరిలో భూసేకరణ, కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూముల స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై గవర్నర్‌కు వివరించారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుని న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కవిత వెల్లడించారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, తెలంగాణ రక్షణ సేన మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల, పరిగి ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా, ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల తరఫున తమ ఉద్యమం కొనసాగుతోందన్నారు. తమ పోరాట ఫలితంగానే వెలుగుమట్ల బాధితులకు అదే ప్రాంతంలో భూమి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పరిగి ట్రిపుల్ ఆర్ భూసేకరణ ప్రక్రియలను కూడా తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్పారు.

అయితే ఇవన్నీ పాక్షిక విజయాలేనని పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. అందుకే గవర్నర్‌ను కలిసి అన్ని అంశాలను వివరించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మళ్లీ ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని మార్గాల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు సార్లు అలైన్‌మెంట్ మార్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కవిత తెలిపారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాసిన లేఖను కూడా గవర్నర్‌కు చూపించామని పేర్కొన్నారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మహిళలకు చీరలు ఇచ్చి వారిని కోటీశ్వరులు చేశామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. మరోవైపు మహిళల ఇళ్లను కూల్చివేస్తూ వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతల సమయంలో ఒక మహిళకు గర్భస్రావం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాల ఆవేదన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని అన్నారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని కవిత విమర్శించారు. కల్లాల్లో రైతుల ధాన్యం పేరుకుపోయి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు లేకపోతే సమాజానికి అన్నం దొరకదని పేర్కొంటూ వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.