Let's talk: editor@tmv.in
దివ్యాంగులకు న్యాయం చేయాలి.. వైఎస్ జగన్‌ను ఆశ్రయించిన ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్

దివ్యాంగులకు న్యాయం చేయాలి.. వైఎస్ జగన్‌ను ఆశ్రయించిన ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్

Panthagani Anusha
20 మే, 2026

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటీవల విడుదల చేసిన అధ్యాపక నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ప్రతినిధి బృందం కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 19 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా మొత్తం 1,523 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే ఈ భారీ నియామక ప్రక్రియలో దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో శ్రమమించి ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీలు పూర్తి చేసిన అనేక మంది దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదంలో పడ్డారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా భారత ప్రభుత్వం దివ్యాంగుల సమానత్వం, సాధికారత, హక్కుల పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'దివ్యాంగుల హక్కుల చట్టం-2016' ను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ప్రతినిధులు ఈ సందర్భంగా ఆరోపించారు. చట్టం అమలులో జరుగుతున్న లోపాల కారణంగా అర్హులైన దివ్యాంగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కేవలం రెగ్యులర్ పోస్టుల్లోనే కాకుండా, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాలలో కూడా దివ్యాంగులకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పించడం లేదని వారు వాపోయారు.

ఇక దివ్యాంగుల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులకు న్యాయం జరిగేలా తమ వంతుగా అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను, తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు, వారికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన అవకాశాల సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ప్రతినిధి బృందానికి ఆయన స్పష్టమైన భరోసా ఇచ్చారు.