Let's talk: editor@tmv.in
తొమ్మిదేళ్లైనా న్యాయం దక్కలేదు.. జగన్‌ను ఆశ్రయించిన సుగాలి ప్రీతి కుటుంబం

తొమ్మిదేళ్లైనా న్యాయం దక్కలేదు.. జగన్‌ను ఆశ్రయించిన సుగాలి ప్రీతి కుటుంబం

Panthagani Anusha
27 మే, 2026

తమ కుమార్తె సుగాలి ప్రీతి మృతికి కారణమైన వారికి శిక్ష పడేలా చూసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు జగన్‌ను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో తమ కుమార్తెపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తమకు పూర్తి స్థాయిలో న్యాయం లభించలేదని వారు కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రీతి తల్లిదండ్రులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ విజ్ఞప్తిని మన్నించి, కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని వారు గుర్తుచేశారు. అంతేకాకుండా నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్ని విధాలా ఆదుకుందని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.

అయితే రాష్ట్రంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కనపెట్టేశారని సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని వారు ఆరోపించారు. నిందితులకు శిక్ష పడేలా, నిలిచిపోయిన కేసు విచారణను తిరిగి పునరుద్ధరించేలా తమకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించాలని వారు వైయస్ జగన్‌ను అభ్యర్థించారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను కూడా నిలిపివేశారని ప్రీతి తల్లిదండ్రులు వాపోయారు. తాము ప్రభుత్వ వైఫల్యాలపై పెండింగ్ కేసులపై మాట్లాడుతున్నామనే కారణంతోనే పెన్షన్ కట్ చేశామని స్థానిక అధికారులు ముఖం మీదే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలని ప్రస్తుత పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వివరించారు.

బాధిత తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి, సుగాలి ప్రీతి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చట్టపరంగా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయాన్ని పార్టీ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ భవిష్యత్తులో కూడా వారి పోరాటానికి తోడుగా ఉంటామని స్పష్టం చేశారు.