
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగం కల్పించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం పంజాబ్ - హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ లీసా గిల్, త్వరలోనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.
25న బాధ్యతల స్వీకారం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. ఆయన పదవీ విరమణ చేసిన మరుసటి రోజున ఏప్రిల్ 25న జస్టిస్ లీసా గిల్ నూతన సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తన హయాంలో అనేక కీలక తీర్పులు వెలువరించడంతో పాటు న్యాయ పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
జస్టిస్ లీసా గిల్ విద్యాభ్యాసం చండీగఢ్‌లోనే సాగింది. స్థానిక కార్మెల్ కన్వెంట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్ (సెక్టార్-11)లో డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టాలను అందుకున్నారు. 1990లో అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, పంజాబ్-హర్యానా హైకోర్టులో క్రిమినల్, సివిల్, సర్వీస్ రాజ్యాంగ పరమైన కేసుల్లో అపార అనుభవం గడించారు.
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు ప్రభుత్వ సంస్థల తరపున కీలక కేసులు వాదించిన ఆమెను 2014 మార్చి 31న పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతులు కల్పించారు. సుదీర్ఘ కాలంగా న్యాయవ్యవస్థలో విశేష సేవలు అందిస్తున్న జస్టిస్ లీసా గిల్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
