
అప్పుడే.. ఏడు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ వ్యూహాలు
ఈ ఎన్నికల సీజన్‌లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఫలితాలు రాకముందే , వచ్చే ఏడాది జరగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందస్తు వ్యూహాలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా కీలక రాష్ట్రాల్లో 2027 ఎన్నికల కోసం పార్టీ ‘గ్రౌండ్ వర్క్’ మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోడీ బీజేపీకి కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తూ నిధుల వరదను పారిస్తూ ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టారు. పంజాబ్ నుంచి ఎన్నికైన ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలను ఎగువ సభలో విలీనం చేసుకుంది. ఈ విషయంలో అమిత్‌షా రాజకీయంగా పావులు కదిపారు. దీంతో పంజాబ్‌లో పార్టీ పటిష్టతకు మార్గం సుగమం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మార్గదర్శకత్వంలో, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనలతో ఈ ప్రణాళికలు అమలు అవుతున్నాయని సమాచారం.
ఎన్నికలు ముగిసిన వెంటనే తదుపరి ఎన్నికలు ప్రారంభం
పార్టీ వర్గాల ప్రకారం, బీజేపీ నిరంతరం సంవత్సరంలో 365 రోజులు, 24x7 రాజకీయంగా యాక్టివ్ మోడ్‌లో పనిచేస్తోంది. ఒక ఎన్నిక ముగిసిన వెంటనే తదుపరి ఎన్నికకు సిద్ధమవడం బీజేపీ విధానమని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతి రాష్ట్రంలో బూత్ స్థాయిలో కార్యకర్తలను బలపరచడం, వారి మధ్య సమన్వయం, వ్యూహాత్మక సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
పలు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటించి, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా రహస్య సమావేశాలు నిర్వహించి భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఇక త్వరలో ఉత్తరాఖండ్‌లో కూడా ఆయన పర్యటించనున్నారని సమాచారం.
2027లో కీలక రాష్ట్రాలు
2027లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. పార్టీ వర్గాల ప్రకారం, బీజేపీ కేవలం తక్షణ ఎన్నికల విజయాలపై కాకుండా, దీర్ఘకాలిక సంస్థాగత బలంపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే ఉన్న బలమైన రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించడం, అలాగే కొత్త ప్రాంతాల్లో ప్రభావాన్ని విస్తరించడం లక్ష్యమని నేతలు తెలిపారు. బీజేపీ నాయకత్వం ప్రకారం, క్యాడర్ ఆధారిత రాజకీయ వ్యవస్థ, నిరంతర ఎన్నికల సన్నద్ధతే పార్టీ బలానికి కారణమని చెబుతున్నారు. అందుకే ఒక ఎన్నిక ముగియకముందే మరో ఎన్నికకు ప్రణాళికలు ప్రారంభించడం పార్టీ ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు. ఈ వ్యూహంతో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే రాజకీయ సమీకరణాలను తమ వైపునకు మలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
