Let's talk: editor@tmv.in
హాల్ టికెట్ చూపిస్తే చాలు.. నీట్ అభ్యర్థులకు ఫ్రీ బస్ జర్నీ!

హాల్ టికెట్ చూపిస్తే చాలు.. నీట్ అభ్యర్థులకు ఫ్రీ బస్ జర్నీ!

Dantu Vijaya Lakshmi Prasanna
19 జూన్, 2026

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరిగే నీట్ పునఃపరీక్షకు వెళ్లే అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విద్యార్థులు తమ నీట్ హాల్ టికెట్‌ను చూపిస్తే సరిపోతుందని, ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరని తెలిపారు. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడనుంది. ప్రయాణ ఖర్చుల భారం తగ్గడంతో పాటు పరీక్ష రోజు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు, ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాగా, ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయబడింది. అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. అభ్యర్థుల కోసం కొత్త హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.

దేశంలోని పలు రాష్ట్రాలు కూడా నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారని అధికారులు తెలిపారు.