Let's talk: editor@tmv.in
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్: శాంభవి‍ జోడీకి రికార్డు స్వర్ణం

జూనియర్ షూటింగ్ ప్రపంచకప్: శాంభవి‍ జోడీకి రికార్డు స్వర్ణం

Shaik Mohammad Shaffee
25 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతోంది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జోడి శాంభవి క్షీరసాగర్, దివ్యాన్షు దేవాంగన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్లో వీరు ఏకంగా 499.9 పాయింట్లు సాధించి, జూనియర్ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ 632.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఈ జంట, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇదే విభాగంలో చైనీస్ తైపీకి చెందిన త్సాయ్ చీ-యింగ్, చెన్ యూ-అన్ జంట రజతం సాధించగా, ఫ్రాన్స్‌కు చెందిన టిఫెన్ పోమ్స్, గ్యాస్పార్డ్ లెసియర్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు.

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పీ విభాగంలోనూ గోల్డ్

భారత షూటర్ ప్రాచీ గైక్వాడ్ సైతం దేశానికి మరో బంగారు పతకాన్ని అందించారు. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీల్లో ప్రాచీ అత్యంత పోటాపోటీగా ఆడి ప్రథమ స్థానంలో నిలిచారు. ఫైనల్లో ఆమె 354.6 పాయింట్లు సాధించి, తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకున్న స్వతంత్ర క్రీడాకారిణి దర్యా చుప్రిస్ (354.4)పై విజయం సాధించారు. మరో స్వతంత్ర క్రీడాకారిణి ఎలెనా క్రెటినినా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

మిగిలిన విభాగాల్లోనూ భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో నరేన్ ప్రణవ్ 229.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. అటు 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ జూనియర్ విభాగంలో సమీర్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్ గమలేరి ప్రపంచ రికార్డును సమం చేస్తూ స్వర్ణాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం కైరో షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పోటీలు ముగియడానికి మరో రోజు సమయం ఉండగా, ఇంకా ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీ జరగాల్సి ఉంది. భారత షూటర్ల ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మరిన్ని పతకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.