Let's talk: editor@tmv.in
జూనియర్ షూటింగ్‌ ప్రపంచకప్‌: భారత్‌కు 13 పతకాలు

జూనియర్ షూటింగ్‌ ప్రపంచకప్‌: భారత్‌కు 13 పతకాలు

Shaik Mohammad Shaffee
27 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ షూటింగ్ వేదికపై భారత యువ షూటర్లు మరోసారి పతకాల పంట పండించారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా టోర్నీలో మొత్తం 16 పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు రోజైన ఆదివారం భారత్‌ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యం చేరాయి.

హేమంత్‌ గురి అదిరింది!

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత షూటర్ హేమంత్ బర్మన్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని ముద్దాడారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో హేమంత్ 351.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే విభాగంలో కజకిస్థాన్ షూటర్ ఒలేగ్ నోస్కోవ్ 355.6 పాయింట్లతో సరికొత్త జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణాన్ని గెలుచుకోగా, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నికితా సోకోలోవ్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఫైనల్‌కు చేరిన మరో ఇద్దరు భారతీయులు రోహిత్ కాన్యన్, వేదాంత్ నితిన్ వాఘ్మరే వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచి పతక అవకాశాలను చేజార్చుకున్నారు.

షాట్‌గన్‌లోనూ పతక బోణీ

మిక్స్‌డ్ ట్రాప్ టీమ్ విభాగంలో భారత్‌కు తొలి షాట్‌గన్ పతకం లభించింది. జుహైర్ ఖాన్, ఆద్యా కత్యాల్ ద్వయం కాంస్య పతకంతో మెరిశారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 137 స్కోరుతో మూడో స్థానంలో నిలిచిన ఈ జంట, నిర్ణయాత్మకమైన ఫైనల్లో 19 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో హంగేరీ జట్టు ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడిని తన్నుకుపోగా, తటస్థ అథ్లెట్లు రజతాన్ని గెలుచుకున్నారు. మరో భారత జోడీ మానిత్వ సింగ్ రావత్, సబీరా హారిస్ తొమ్మిదో స్థానానికే పరిమితమయ్యారు.

నిరాశపరిచిన మహిళలు

మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. తేజల్ అథావత్ 610.2 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచి పతకాన్ని కొద్దిలో కోల్పోయారు. ఇతర షూటర్లు అనుష్క థోకూర్, ఖ్వాయిష్ శర్మ, యుగేశ్వరి వరుసగా 8, 12, 13 స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో మొత్తం 25 దేశాల నుంచి 284 మంది షూటర్లు పోటీపడగా, భారత్ అత్యధికంగా 71 మంది సభ్యులతో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దింపింది.

ఆధిపత్యం భారత్‌దే!

పతకాల పట్టికను గమనిస్తే.. భారత్ 16 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, తటస్థ అథ్లెట్లు (11 పతకాలు) రెండో స్థానంలో, ఫ్రాన్స్ (6 పతకాలు) మూడో స్థానంలో నిలిచాయి. గతేడాది న్యూఢిల్లీ, సుల్ (జర్మనీ)లలో జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో భారత్ 37 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ షూటింగ్ రంగంలో భారత్ తన పట్టును నిరూపించుకుంది.