Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో ‘జంగిల్‌ రాజ్‌’.. బాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో ‘జంగిల్‌ రాజ్‌’.. బాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్‌ జగన్‌

Panthagani Anusha
25 మే, 2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అణచివేత చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక నియంతలా మారి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులిమేందుకు ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

పొన్నూరు పరామర్శపై పోలీసుల పైశాచికత్వం

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో బాధిత రైతులు పరామర్శించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్‌, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్‌ కృష్ణ, అంబటి మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పైశాచికంగా దాడి చేసి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమ నాయకులపై అక్రమంగా వ్యవహరించిన విధానం అత్యంత దారుణంగా ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే ప్రభుత్వం ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతోందని చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోందని జగన్ ప్రశ్నించారు.

మొక్కజొన్న రైతులపై దాడులు.. అక్రమ కేసులు

రాష్ట్రంలో మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ఉండాల్సి ఉండగా ఈ ఏడాది రైతులకు రూ.1,400 నుండి రూ.1,600 కూడా దక్కడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో మామిళ్లపల్లె గ్రామానికి చెందిన కొంతమంది కాపు సామాజిక వర్గ రైతులు తమ మొక్కజొన్న పంటను తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వ చేసుకున్నారని తెలిపారు. అయితే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో వారిపై దాడులు చేయించడమే కాకుండా బాధితులైన ఆ రైతులపైనే అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. కనీస మద్దతు ధర కల్పించకపోగా ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం ఏ రకమైన న్యాయమని, రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తే పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా అని నిలదీశారు.

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై కేసు పెట్టడం దారుణం

మరోవైపు ప్రభుత్వం తన దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ నిరంతరం ప్రజాపక్షాన నిలిచే ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ప్రభుత్వం దగ్గరుండి కక్షపూరితంగా కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అన్ని రాజకీయ పార్టీల విధానాలను విమర్శిస్తూ నిష్పాక్షికంగా వార్తా విశ్లేషణలు చేసే ఒక మేధావి నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్టులా, విమర్శిస్తే వేధింపులా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పూర్తిగా 'జంగిల్‌రాజ్‌'గా మార్చేశారని ఆయన దుయ్యబట్టారు.

ప్రజలు ఎల్లకాలం సహించరు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్ జగన్ హెచ్చరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలని, ప్రజలు ఎల్లకాలం ఈ అరాచకాలను సహించరని పేర్కొన్నారు. ప్రజల కోసం నిలబడటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతని, ప్రభుత్వ అక్రమాలు, అణచివేతలు, కక్షసాధింపు చర్యలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన గళం విప్పుతూ, వారికి అండగా ఉంటుందని జగన్ పునరుద్ఘాటించారు.