Let's talk: editor@tmv.in
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

Gaddamidi Naveen
29 మే, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయమే ఘాట్‌ను సందర్శించి తన తాతకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, మరో మనవడు నందమూరి చైతన్య కృష్ణ కూడా ఘాట్ వద్ద పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన లక్ష్మీపార్వతి భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను దేవుడిగా పూజిస్తారు. ఆయన జ్ఞాపకార్థం ఎన్నో చోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికే మహానుభావులలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారు. ఆయనకు భార్యను కావడం నా పూర్వజన్మ సుకృతం" అని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పిస్తూ, ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన సేవలు, సినీ రంగంలో చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన నందమూరి చైతన్య కృష్ణ కూడా నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.

1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ‘తోడు దొంగలు’, ‘సీతారామ కళ్యాణం’, ‘వరకట్నం’ చిత్రాలకు మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. ‘రాజు పేద’, ‘లవకుశ’ సినిమాలకు రాష్ట్రపతి అవార్డులు సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించి తెలుగు జాతి కీర్తిని దశదిశలా చాటారు.