Let's talk: editor@tmv.in
‘సువర్ణగిరి’గా జొన్నగిరి.. మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
‘సువర్ణగిరి’గా జొన్నగిరి.. మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
‘సువర్ణగిరి’గా జొన్నగిరి.. మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

‘సువర్ణగిరి’గా జొన్నగిరి.. మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
25 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక ప్రస్థానంలో సరికొత్త 'సువర్ణ అధ్యాయం' లిఖించబడింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో రూ. 405 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంగారు గనుల తవ్వకం, ప్రాసెసింగ్ ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. దీనితో రాష్ట్రంలో వాణిజ్యపరమైన బంగారు ఉత్పత్తి ప్రక్రియ అధికారికంగా ప్రారంభ‌మైంది. 2047 నాటికి తాము నిర్దేశించుకున్న ‘స్వర్ణాంధ్ర’ స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయాణంలో ఈ ప్రాజెక్ట్ ఒక చారిత్రాత్మక మైలురాయి అని సీఎం అభివర్ణించారు.

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించి, ప్లాంట్ రెండో విడత విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన అతిపెద్ద బంగారు గనుల ఉమ్మడి ఉత్పాదక సంస్థ ఇదేనని, ఇది వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిని పరుగులు పెట్టించడమే కాకుండా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

రత్నాల సీమకు పూర్వవైభవం - జొన్నగిరి ఇకపై 'సువర్ణగిరి'

ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఒకప్పుడు రత్నాల నిలయంగా వెలిగిన రాయలసీమ.. నేడు ఈ బంగారు అధ్యాయానికి కేంద్రబిందువుగా మారిందని సీఎం ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా జొన్నగిరి ప్రాంతానికి ఉన్న ఘనమైన చారిత్రాత్మక నేపథ్యాన్ని సీఎం గుర్తుచేశారు. ప్రాచీన కాలంలో ఈ జొన్నగిరి ప్రాంతాన్ని ‘సువర్ణగిరి’ అని పిలిచేవారని, ఇది అశోక చక్రవర్తి పరిపాలించిన నాలుగు ప్రధాన రాజధానులలో ఒకటిగా ఉండేదని తెలిపారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఎర్రగుడిలో లభించిన శాసనాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని, ఈ ప్రాంత ప్రాముఖ్యతను అవి తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, నవరత్నాల నిక్షేపాలకు నిలయంగా ఉండేదని.. శ్రీకృష్ణదేవరాయల పాలనలో రాయలసీమలో రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి విక్రయించారని గుర్తుచేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కోహినూర్ వజ్రం’ కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే దొరికిందని, ఖనిజ సంపదతో మన రాష్ట్రానికి ఎంతో కాలంగా విడదీయరాని సంబంధం ఉందని కొనియాడారు. ఒకప్పుడు కరవు కాటకాలతో ఎడారిగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న రాయలసీమ ప్రాంతం.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల పునరుజ్జీవం పొందిందని వివరించారు. ఈ బంగారు గనుల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, 'జొన్నగిరి' గ్రామం పేరును అధికారికంగా ‘సువర్ణగిరి’ గా మారుస్తున్నట్లు సీఎం ప్రతిపాదించారు. అంతేకాకుండా, ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుని, అన్ని వసతులతో కూడిన ఒక ‘సువర్ణగిరి మోడల్ విలేజ్’ గా తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు.

భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, అందుకు అనుగుణంగా తాము ఏపీని ‘స్వర్ణాంధ్ర’గా, రాయలసీమను తిరిగి ‘రత్నాల సీమ’గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశం ఏడాదికి దాదాపు 800 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, ముడి చమురు తర్వాత మన దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు బంగారమేనని చెప్పారు. మన దేశంలోనే అంతర్గతంగా ఉత్పత్తి పెరగడం వల్ల విలువైన విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆదా అవుతాయని వివరించారు.

ఉత్పత్తి.. ప్రభుత్వానికి ఆదాయ వివరాలు

ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి ఏడాది దాదాపు 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే ఏళ్లలో ఈ ఉత్పాదక సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఈ గని ద్వారా లభించే బంగారం మొత్తం విలువపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 శాతం రాయల్టీ ఆదాయం దక్కుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి రూ. 57 కోట్ల ఆదాయం, రాబోయే రోజుల్లో వార్షిక ఉత్పత్తి 900 కిలోలకు చేరినప్పుడు ఏకంగా రూ. 144 కోట్ల ఆదాయం రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.

ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ‘జియో మైసూర్ సర్వీసెస్’, ‘త్రివేణి ఎర్త్‌మూవర్స్’ సంస్థల యాజమాన్యాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వం ఈ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా.. మొదటి దశలో 600 ఎకరాలలో మైనింగ్, ప్రాసెసింగ్ పనులు విజయవంతంగా ప్రారంభమయ్యాయని, తదుపరి దశల్లో మిగిలిన విస్తీర్ణానికి ప్రాజెక్టును విస్తరిస్తామని చెప్పారు.

స్థానికంగా జ్యువెలరీ పార్క్ - ఏపీ ఖనిజాల గని

ఇక్కడి గనుల నుంచి లభ్యమయ్యే బంగారాన్ని వేరే ప్రాంతాలకు తరలించకుండా, స్థానికంగానే బంగారు ఆభరణాలుగా తయారు చేసేలా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఒక అత్యాధునిక ‘జ్యువెలరీ పార్క్’ ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. దీనివల్ల స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు ‘అన్నపూర్ణ’ మాత్రమే కాకుండా ఇటు ‘రత్నగర్భ’ కూడా అని సీఎం అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కడప జిల్లాలోని మంగంపేటలో బేరైట్స్‌, కడపలోనే సున్నపురాయి, యురేనియం, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌, చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్‌, కుప్పంలో గ్రీన్ గ్రానైట్‌, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్‌, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్ ఖనిజాలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇనుప ఖనిజం, అలాగే కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వివరించారు.

ఈ సహజ వాయువు, ఖనిజ వనరుల ఆధారంగా ‘వాల్యూ-ఎడిషన్’ పరిశ్రమలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే రాబోతున్న సిమెంట్, స్టీల్, మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఏపీలోనే కొలువులు లభిస్తాయన్నారు. పారిశ్రామిక అనుమతులను అత్యంత వేగంగా ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక మోడల్‌గా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు పాలించిన గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తన తుగ్లక్ విధానాలతో పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని, అయితే ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వ విధానాలపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారని విమర్శించారు.

జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

రాయలసీమ పారిశ్రామిక ప్రగతికి తాము కట్టుబడి ఉన్నామని చెప్తూ, వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్మించతలపెట్టిన ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’ కు వచ్చే జూలై 3వ తేదీన తానే స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. 2028 నాటికి ఈ స్టీల్ ప్లాంట్ లో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించడమే లక్ష్యంగా గడువు విధించుకున్నట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు తిరుపతిలో ప్రతిష్టాత్మక 'రాయల్ ఎన్‌ఫీల్డ్' మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటు, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వెల్లడించారు.

ట్యాగ్‌లు
JonnagiriGoldMineGoldMiningAndhraPradeshSwarnaAndhra2047ChandrababuNaiduRayalaseemaKurnoolSuvarnagiriAPDevelopment
‘సువర్ణగిరి’గా జొన్నగిరి.. మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు - Tholi Paluku