
ఏపీ-సింగపూర్ ఒప్పందం అమలుకు జాయింట్ వర్కింగ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరమైన సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సింగపూర్ తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అమలును వేగవంతం చేసేందుకు ‘జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని శుక్రవారం అధికారికంగా ఏర్పాటు చేసింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ మధ్య 2025, నవంబర్ 14న ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా సుస్థిర పట్టణ పరిపాలన (, డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పెంపొందించడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం.
అయితే ఈ ఒప్పందంలోని అంశాలను క్షేత్రస్థాయిలో సమన్వయం చేయడం పర్యవేక్షించడం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో పీయూష్ కుమార్‌తో పాటు జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్, ప్రణాళిక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి, ఆర్‌టీజీఎస్ సీఈఓ ప్రకర్ జైన్, ఆర్థిక శాఖ జాయింట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దట్టి సురేంద్ర సభ్యులుగా వ్యవహరిస్తారు.
కాగా ఈ ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేసేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ కూడా త్వరలో ఏర్పాటు కానుంది. స్టీరింగ్ కమిటీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటే, వర్కింగ్ కమిటీ రోజువారీ అమలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ పురోగతి నివేదికలను సమర్పిస్తుంది. సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
