
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి.. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రాత్రికి ఫలితాలను వెల్లడించింది. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయిలో 26 మంది విద్యార్థులు 100కు 100 పర్సంటైల్ సాధించి అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది (2025) ఈ ఘనత సాధించిన వారి సంఖ్య 24గా ఉండగా, ఈసారి ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది.
ఏపీ, తెలంగాణ విద్యార్థుల హవా
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలో 100కు 100 పర్సంటైల్ సాధించిన 26 మంది విద్యార్థులలో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి, నరేంద్ర బాబు గారి మహిత్, తుంగ దుర్గ సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్ర శేఖర్ రెడ్డి ఈ ఘనత సాధించగా.. తెలంగాణ నుంచి మంతా శివ కామేశ్, డి. భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహిష్వరి, రిషి ప్రేమ్‌నాథ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి తెలుగు వారి సత్తా చాటారు.
వీరితో పాటు రాజస్థాన్ నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర, హర్యానా నుండి ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. చండీగఢ్, బీహార్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో నిలిచారు. విశేషమేమిటంటే, ఈసారి 100 పర్సంటైల్ సాధించిన 26 మంది విద్యార్థులూ పురుషులే కావడం గమనార్హం.
ఏమిటీ ఎన్‌టీఏ స్కోరు?
చాలామంది ఎన్‌టీఏ స్కోరును మార్కుల శాతంగా భావిస్తారు, కానీ అది తప్పు. దీనిని 'నార్మలైజేషన్' పద్ధతిలో లెక్కిస్తారు. పరీక్షను వివిధ సెషన్లలో (షిఫ్టులలో) నిర్వహించడం వల్ల, ఒక్కో సెషన్‌లో ప్రశ్నపత్రం కఠినత ఒక్కోలా ఉంటుంది. అందరికీ సమాన న్యాయం చేసేందుకు, విద్యార్థి తన షిఫ్టులో రాసిన మిగిలిన వారితో పోలిస్తే ఎంత మెరుగ్గా రాశారు అనే దాని ఆధారంగా 100 నుండి 0 మధ్య ఈ స్కోరును కేటాయిస్తారు.
భారీగా పెరిగిన పోటీ
ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు పోటీ గతంలో కంటే పెరిగింది. జనవరిలో జరిగిన మొదటి విడత పరీక్షకు 13 లక్షల మందికి పైగా హాజరుకాగా, ఏప్రిల్ రెండో విడతలో 10 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు రెండు విడతల్లోనూ పరీక్ష రాశారు. రెండు సార్లు పరీక్ష రాసిన వారిలో ఏ విడతలో ఉత్తమ స్కోరు వస్తే దానినే ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు.
2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
జేఈఈ మెయిన్ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం 2,50,182 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా జనరల్ కేటగిరీ నుండి 96,873 మంది ఉండగా, ఓబీసీ విభాగం నుండి 67,597 మంది, ఎస్సీ నుండి 37,522 మంది, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) నుండి 25,009 మంది మరియు ఎస్టీ కేటగిరీ నుండి 18,790 మంది విద్యార్థులు తదుపరి పరీక్ష రాయడానికి ఎంపికయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17వ తేదీ జరగనుంది. అడ్వాన్స్‌డ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్.ఐ.టి, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి.
