
తెలంగాణ కోసం జీవితాంతం తపించిన ఉద్యమకారుడు జయశంకర్: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్‌ను ‘లైఫ్ టైమర్’ ఉద్యమకారుడిగా అభివర్ణిస్తూ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో మూడు రకాల ఉద్యమకారులు ఉండేవారని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రస్తావించేవారని తెలిపారు. తమ పనులతో పాటు అవసరమైనప్పుడు ఉద్యమంలో పాల్గొనేవారు, పూర్తికాలం ఉద్యమం కోసం పనిచేసేవారు, జీవితాంతం ఉద్యమానికే అంకితమయ్యేవారు అనే మూడు వర్గాల్లో ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్గానికి చెందిన ‘లైఫ్ టైమర్’ ఉద్యమకారుడని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఏ దశలో ఉన్నప్పటికీ జయశంకర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాలనలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు.
అయితే గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ అస్తిత్వం, ఉనికికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని అందరూ పునరుద్ధరించుకుని తెలంగాణ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
