Let's talk: editor@tmv.in
దేశ సమగ్రతే జనసేన లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దేశ సమగ్రతే జనసేన లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దేశ సమగ్రతే జనసేన లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
16 జూన్, 2026

దేశ సమగ్రత, సమైక్యతకు ఎలాంటి ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. "దేశమే ముందు, మిగతావన్నీ తరువాత" అనేది తమ పార్టీ ప్రధాన విధానం, నినాదమని ఆయన ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులపై రాజీలేని పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. "జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది అధికారం కోసమో, పదవుల కోసమో, నిరసనల కోసమో కాదు; జాతి సమగ్రతకు నిలబడాలనే విశాలమైన దృక్పథంతోనే" అని స్పష్టం చేశారు. ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికే కొందరు ప్రాంతీయ నాయకులకు ఢిల్లీ రాగానే నోరు పెగలదని, కానీ జనసేన ఎల్లప్పుడూ దేశ పురోగతి కోసమే ఆలోచిస్తుందని ఎద్దేవా చేశారు.

2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పదవుల ఆశ లేదని, దేశానికి ఏం చేయాలనే ఆలోచనే మూలమని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, పరాజయాలు ఎదుర్కొని, ప్రస్తుతం 21 లక్షల మంది బలమైన సైన్యాన్ని తయారుచేశామన్నారు. నిస్వార్థమైన జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధాంతాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.

సర్దార్ పటేల్ స్ఫూర్తి

దేశ ఔన్నత్యానికి, ప్రతి భారతీయుడి కలలకు ఢిల్లీ నిలువెత్తు సాక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమయంలో మత ప్రాతిపదికన దేశం విడిపోయినప్పుడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారని, ఆ కల్లోల స్థితిలో 536 సంస్థానాలను ఏకం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రమ అమేయమని కొనియాడారు. పటేల్ చెప్పిన దేశ సమగ్రత సూత్రాన్నే జనసేన పాటిస్తుందన్నారు.

రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ, జనసేన ఎన్నడూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదని, అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇవ్వడం వల్లే నేటికీ ఆస్తుల పంపకాల్లో సమస్యలు, ప్రజల మధ్య విద్వేషాలు రగులుతున్నాయని విమర్శించారు. ఆ అశాంతి నేటికీ మానని గాయంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ద్రోహానికి, విభజన వాదానికి పాల్పడే చెడు శక్తులను చలిచీమలతో పోల్చుతూ.. అవన్నీ కలిసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తే జనసేన గళం బలంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు.

జనసేన ఎంపీలకు బాధ్యత

లోక్‌సభలో ఇద్దరు, రాజ్యసభలో ఒకరు చొప్పున ఉన్న జనసేన ముగ్గురు ఎంపీలపై చాలా పెద్ద బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఎంపీలు కేవలం తమ నియోజకవర్గ సమస్యలకే గిరి గీసుకోకుండా, యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తుంచుకోవాలన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రతిష్టకు, సంక్షేమానికి భంగం కలిగించే ప్రతి అంశంపై పార్లమెంటు వేదికగా దేశం మొత్తానికి తెలిసేలా గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు.

చివరగా, ‘జెన్ జీ’ తరానికి దేశభక్తితో కూడిన విలువలను, ప్రాథమిక హక్కులు-విధులను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వచ్చే తరానికి నిజాయతీతో కూడిన రాజకీయాలు, నీతివంతమైన పాలనను జనసేన చూపిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, పిడుగు హరిప్రసాద్, జయమంగళ వెంకట రమణలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.