
జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే: ఏపీ డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ గడ్డతో జనసేన పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఈ ప్రాంతపు విశిష్టతను గుర్తుచేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తన సందేశంలో.. "మూడున్నర కోట్ల మంది ప్రజల సుదీర్ఘ ఆశలు, ఆకాంక్షలు... యువత చేసిన ఎన్నో బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ఈ గడ్డ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం (పన్నెండేళ్లు) పూర్తయిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
జనసేనకు ఊపిరిపోసిన గడ్డ
జనసేన పార్టీ ఆవిర్భావ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. "జనసేన పార్టీ ఊపిరులూదుకొన్నది ఈ తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా వచ్చే పోరాట పటిమను మా పార్టీ పుణికిపుచ్చుకుంది. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, యువత ఆకాంక్షల కోసం నిలబడే తత్వం ఇక్కడిది. సమాజంలో వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కడైనా విఘాతం కలిగితే- ఎదురునిలిచి గళం వినిపించే తెగువ, ధైర్యం ఒక్క తెలంగాణకే ఉంది. అటువంటి అద్భుతమైన పోరాట లక్షణమే నేడు జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉందని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదతో విలసిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరింత సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలిదానం చేసిన ప్రతి ఒక్క అమరవీరునికి ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులెత్తి అంజలి ఘటించారు.
