Let's talk: editor@tmv.in
జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు.. నేడు ఢిల్లీలో కీలక సమావేశం

జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు.. నేడు ఢిల్లీలో కీలక సమావేశం

Gaddamidi Naveen
15 జూన్, 2026

జనసేన పార్టీ సరికొత్త రాజకీయ ఒరవడికి సిద్ధమవుతోంది. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూనే జాతీయవాదాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (నేడు) సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత అశోక హోటల్‌లో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం అనే స్పష్టమైన విధానంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమాలోచనలు సాగనున్నాయి.

జనసేన పార్టీ ఆవిర్భవించి పన్నెండేళ్లు పూర్తయిన తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను, భాషలను గౌరవిస్తూ జాతీయ సమగ్రత కోసం జనసేన ఏ విధంగా పనిచేసిందో పవన్ కళ్యాణ్ ఈ వేదికపై వివరించనున్నారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే దేశ సమైక్యత కోసం ఒక రాజకీయ శక్తిగా ఎలా నిలబడాలో ఆయన స్పష్టం చేయనున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో భారీ భేటీ

ఈ జాతీయ స్థాయి సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పొరుగు రాష్ట్రాల నేతలు కూడా తరలివస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల జనసేన పార్టీలో చేరిన ముఖ్య నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో భాగస్వాములు కానున్నారు. ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాలు, వర్తమాన పరిస్థితుల్లో జాతీయ సమగ్రతను కాపాడటంలో ప్రాంతీయ పార్టీల పాత్రపై పవన్ కళ్యాణ్ ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేస్తారు. రాజధాని వేదికగా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జనసేన ముఖ్య నేతలు ఢిల్లీలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.