
'జమిలి ఎన్నికలు' సాధ్యం కాదు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) విధానాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, కేంద్రంలో అధికారంలో ఉన్నవారి స్వార్థం కోసం, అధికార కేంద్రీకరణకు జరుగుతున్న ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. ఈ విధానం వల్ల దేశ సమాఖ్య వ్యవస్థ దెబ్బతిని, రాష్ట్రాలు తీవ్రంగా బలహీనపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో 'సంయుక్త పార్లమెంటరీ స్టడీ కమిటీ' నిర్వహించిన చర్చా వేదికలో డీకే శివకుమార్ పాల్గొని మాట్లాడారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున తాము పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటక శాసనసభ ఇప్పటికే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించిందని పేర్కొన్న శివకుమార్, ఆ తీర్మానాన్ని సమావేశంలో చదివి వినిపించారు. ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని, అమలు చేయడం దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏదైనా ఒక ప్రభుత్వం మధ్యంతరంగా పడిపోతే, అవిశ్వాస తీర్మానం నెగ్గితే, లేదా మెజారిటీ కోల్పోతే అప్పుడు ఏం చేయాలి? దానికి ఈ ప్రతిపాదనలో ఏం పరిష్కారం ఉంది? దీనికి కేంద్రం వద్ద సరైన సమాధానం లేదు అని ఆయన నిలదీశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు కాలాల్లో జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. “కర్ణాటకలో ఎన్నికలు మూడేళ్ల క్రితం జరిగాయి. తమిళనాడు, కేరళలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. పంజాబ్, తెలంగాణలో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి భిన్నమైన గడువులు ఉన్న ఎన్నికలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఆచరణాత్మకంగా అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీల గొంతును అణగదొక్కడానికే ఈ ప్రయత్నమని ఆరోపించిన శివకుమార్, ప్రతిపక్ష పార్టీల ప్రాధాన్యతను తగ్గించే కుట్రగా దీన్ని అభివర్ణించారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఏ మాత్రం అంగీకరించదని, తమ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న వైఖరికే కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
