Let's talk: editor@tmv.in
స్మార్ట్ కిచెన్లపై జగన్ విమర్శలు నిరాధారం: మంత్రి నారా లోకేష్

స్మార్ట్ కిచెన్లపై జగన్ విమర్శలు నిరాధారం: మంత్రి నారా లోకేష్

Gaddamidi Naveen
29 జూన్, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో 'స్మార్ట్ కిచెన్ల' ఏర్పాటుపై వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు రుచి, శుచి, పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

స్మార్ట్ కిచెన్ల వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డున పడతారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఈ కిచెన్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేయనున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఎవరి ఉపాధికీ ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు.

అదేవిధంగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ వివరించారు. ఇందులో 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాబోయే స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితో పాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్ ఎందుకు ఏడుస్తున్నారని, పేదలు బాగుపడితే చూడలేరా అని లోకేష్ ప్రశ్నించారు.

వేతనాల బకాయిలపై క్లారిటీ

జగన్ ఆరోపించినట్లు వేతనాల బకాయిలు ఏవీ లేవని మంత్రి తేల్చిచెప్పారు. కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లకు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశామని స్పష్టం చేశారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా నిబంధనల ప్రకారం వేతనాల చెల్లింపు ఉండదని, జూన్ నెల ఇంకా పూర్తి కాలేదని గుర్తుచేశారు. మరి జగన్ ఎవరి బకాయిల గురించి ఫేక్ ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా మంచి భోజనం పెట్టడం, వారి ఆరోగ్యం బాగుండడం కూడా సహించలేకపోతే ఎలా అని మంత్రి నారా లోకేష్ ఆక్షేపించారు.

ట్యాగ్‌లు
NaraLokeshSmartKitchensAndhraPradeshJobCreationSchoolEducationStudentNutritionYSRCPJaganMohanReddyAndhraPoliticsAmaravati
స్మార్ట్ కిచెన్లపై జగన్ విమర్శలు నిరాధారం: మంత్రి నారా లోకేష్ - Tholi Paluku