
రాజధానితో జగన్ రాజకీయాలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్వార్థ రాజకీయాలు చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒకే ఒక్క శాశ్వత రాజధాని ఉండాలన్నదే ప్రజా సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లాకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో బుధవారం జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - ప్రజా వేదిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభకు విచ్చేసిన ప్రజల నుంచి ‘ఏకైక రాజధాని’ అంశంపై చేతులెత్తించి మద్దతు కోరగా.. జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రజలంతా అమరావతినే కోరుకుంటుంటే, గత వైసీపీ ప్రభుత్వం మాత్రం శాశ్వత రాజధాని లేకుండా చేయాలని చూసిందని మండిపడ్డారు.
నాడు ఒప్పుకుని.. నేడు మోసం చేశారు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి అసెంబ్లీని తరలిస్తే అమరావతినే రాజధానిగా అంగీకరిస్తానని జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ మాటను నమ్మి అమరావతి ప్రాంతానికి చెందిన 29,000 మంది రైతులు సుమారు 33,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ, 2019లో అధికారంలోకి రాగానే జగన్ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్ర అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. అమరావతిని దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని, రాజధాని ప్రాంతంలోని చెరుకు తోటలకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టించి ఆ నిందను తమపై వేయాలని చూశారని సీఎం గుర్తుచేశారు.
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రజలు తమ రాజధానులుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరులను గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, గత వైసీపీ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటే ప్రజలు సమాధానం చెప్పలేక అవమానపడే పరిస్థితి వచ్చింది. అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు.
అమరావతికి కేంద్ర చట్టబద్ధమైన రక్షణ
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని విధానం మారుతుందనే ఆందోళన పెట్టుబడిదారులలో నెలకొందని, అందువల్ల అమరావతికి శాశ్వత చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా తమ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించిందని సీఎం తెలిపారు. పార్లమెంట్‌లోని ఉభయ సభలు (లోక్‌సభ, రాజ్యసభ) అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే బిల్లును ఆమోదించాయని, అయితే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కూడా వైసీపీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు.
అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని, ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ‘మావిగన్’ అంటూ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అమరావతి వైపు రౌడీలతో యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. నాయకుడనే వాడు మాట మీద నిలబడాలని, నిలకడ లేని ఇలాంటి నాయకత్వం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు అమరావతి, స్థిరమైన పాలనపైనే ఆధారపడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
