Let's talk: editor@tmv.in
జగద్గిరిగుట్ట కోనేరుకు హైడ్రా పూర్వవైభవం

జగద్గిరిగుట్ట కోనేరుకు హైడ్రా పూర్వవైభవం

Gaddamidi Naveen
22 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా జగద్గిరిగుట్టలోని ప్రాచీన కోనేరుకు (గుండం) ఎట్టకేలకు కొత్త జీవం వచ్చింది. దశాబ్దాల కాలంగా సాగుతున్న కబ్జా పర్వానికి చెక్ పెడుతూ, హైడ్రా అధికారులు మంగళవారం భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.. దీంతో స్థానిక భక్తులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జగద్గిరిగుట్టలోని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి, కోనేరు కబ్జాకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సానుకూలంగా స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి కోనేరును కాపాడతామని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం, మంగళవారం రంగంలోకి దిగిన హైడ్రా బృందం ఆక్రమణలను నేలమట్టం చేసింది.

సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేరును ఆక్రమణదారులు మట్టితో నింపి, పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. హైడ్రా అధికారులు అక్కడి నిర్మాణ వ్యర్థాలను, చెత్తను తొలగించారు. దాదాపు 26 ట్రక్కుల వ్యర్థాలను తరలించడంతో కోనేరుకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది. పూడికతీత పనులు పూర్తి చేసి, కోనేరు పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టారు.

22 ఏళ్ల నిరీక్షణ ఫలించింది

కోనేరును చూడకుండానే నా ప్రాణం పోతుందేమో అని భయపడ్డాను. దాదాపు 22 ఏళ్ల నా సుదీర్ఘ పోరాటం ఈరోజు ఫలించిందని పూజారి నరహరి భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుడే హైడ్రా రూపంలో వచ్చి ఈ పుణ్యస్థలాన్ని కాపాడారని ఆయన కొనియాడారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, చొరవ చూపిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జగద్గిరిగుట్ట కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, హనుమాన్, వాసవి కన్యకాపరమేశ్వరి, శివాలయం, పరశురామాలయం వంటి అనేక దేవాలయాలు కొలువై ఉన్నాయి. వర్షం పడినప్పుడు గుట్ట పైనుంచి వచ్చే నీరు కోనేరుకు చేరుతుందని, అవసరమైతే బోర్లు వేసి అయినా కోనేరును నింపుతామని పూజారి తెలిపారు. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.