Let's talk: editor@tmv.in
పిల్లల సంఖ్య కాదు.. వారి భవిష్యత్తే ముఖ్యం: కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయి

పిల్లల సంఖ్య కాదు.. వారి భవిష్యత్తే ముఖ్యం: కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయి

Panthagani Anusha
18 మే, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జనాభా పెంపుదలపై చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్, సీపీఐ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సమాజంలో జనాభా పెంపు కంటే నాణ్యమైన జీవన ప్రమాణాలు, పిల్లల భవిష్యత్తే ముఖ్యమని వారు హితవు పలుకుతున్నారు.

కాగా శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పిల్లలను భారం కాకుండా దేశ సంపదగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల భవిష్యత్తు మానవ వనరులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మూడో సంతానం కలిగిన కుటుంబాలకు రూ. 30,000, నాలుగో సంతానం పుట్టిన వారికి రూ. 40,000 చొప్పున ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకం అందిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

అయితే చంద్రబాబు ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత హుస్సేన్ దల్వాయి తీవ్రంగా స్పందించారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే భావన ముమ్మాటికీ తప్పని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ముస్లింలతో సహా అన్ని వర్గాలలో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగిందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దశాబ్దాలుగా దేశం కుటుంబ నియంత్రణ దిశగా అడుగులు వేస్తోందని, ఇలాంటి తరుణంలో జనాభా పెంపును ప్రోత్సహించడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇది వెనకడుగు వేసే పాత రాజకీయ ఆలోచనా విధానమని ఆయన విమర్శించారు.

ఇక కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఈ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ముడిపెడుతూ మాట్లాడారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ మద్దతు ఇవ్వాలని అదేవిదంగా జనాభా తగ్గినందున వారి పార్లమెంట్ స్థానాలు తగ్గిపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనాభా అంశంపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన సమగ్ర విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఈ వాదనతో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కొంత విభేదించారు. భారీ జనాభానే దేశానికి అసలైన బలమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగే వినియోగం ఆర్థిక చలామణికి పెద్ద జనాభానే ప్రధాన కారణమని, అది దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆయన సమర్థించారు. మొత్తానికి, తగ్గుతున్న జనాభా రేటును అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు సంక్షేమ పరంగా ఇటు జాతీయ రాజకీయ పరంగా ఒక కొత్త చర్చకు తెరలేపింది.

పిల్లల సంఖ్య కాదు.. వారి భవిష్యత్తే ముఖ్యం: కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయి - Tholi Paluku