Let's talk: editor@tmv.in
మెగా డీఎస్సీ కాదు.. అదొక ఫ్రాడ్ డీఎస్సీ: వైఎస్ జగన్

మెగా డీఎస్సీ కాదు.. అదొక ఫ్రాడ్ డీఎస్సీ: వైఎస్ జగన్

Panthagani Anusha
26 మే, 2026

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ’ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నిరుద్యోగ యువత కొలువుల ఆశలతో ఆటలాడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకులు, మెరిట్ జాబితాల ట్యాంపరింగ్, పారదర్శకత లోపం వంటి అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ‘సీబీఐ’ చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. "ఇది నిజంగా నిరుద్యోగుల కలలు నిజం చేసే మెగా డీఎస్సీనా? లేక లక్షలాది మంది ఉద్యోగార్థులను నిలువునా ముంచేందుకు వ్యూహాత్మకంగా రచించిన ఫ్రాడ్ డీఎస్సీనా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల ప్రయోజనాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రద్దు చేసిందని మండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే కొత్త నోటిఫికేషన్ తెచ్చి చివరకు పరీక్షల నిర్వహణను లీకులు, స్కామ్‌లు, మేనిప్యులేషన్‌లకు అడ్డాగా మార్చారని విమర్శించారు.

టాపర్ల జాబితా మాయం

డీఎస్సీ ఫలితాల వెల్లడి తదుపరి ప్రక్రియల్లో చోటుచేసుకున్న పలు అనుమానాస్పద అంశాలను జగన్ ఈ సందర్భంగా ఎండగట్టారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కి చెందిన ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం తీవ్ర కలకలం రేపుతోందన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు అభ్యర్థి వివరాలను రాత్రికి రాత్రే డేటాబేస్ నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. మెరిట్ జాబితాలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచకుండా దాచడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎంపిక జాబితాలను ప్రదర్శించకుండా కేవలం ఎంపికైన కొద్దిమందికే రహస్యంగా ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం పంపడం వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందన్నారు.

స్పోర్ట్స్ కోటా పోస్టుల విక్రయం?

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా నియామకాలు సైతం తీవ్ర అవినీతికి గురయ్యాయని జగన్ ఆరోపించారు. ఒక్కో స్పోర్ట్స్ కోటా పోస్టును దాదాపు 15 లక్షల రూపాయలకు విక్రయించారని ఇందులో అధికార పక్షానికి చెందిన ముఖ్య నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి కోట్లు వెనకేసుకున్నారని అసలు క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని వారికి కూడా నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలు (ఫేక్ సర్టిఫికెట్లు) సృష్టించి ఉద్యోగాలు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అర్హులైన నిరుద్యోగుల కొలువులు ప్రైవేట్ ఇళ్లల్లో జరిగే రహస్య ఒప్పందాల ద్వారా అమ్ముడుపోతున్నాయా అని ఆయన నిలదీశారు.

కన్వీనర్ మార్పు వెనుక మర్మమేంటి?

ఇదిలాఉండగా పరీక్షల నిర్వహణ సజావుగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా టెట్ కన్వీనర్‌ను విధులనుంచి తప్పించడంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ను తెచ్చి డీఎస్సీ కన్వీనర్‌గా నియమించడం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే ఈ అవినీతి జాతరపై నిష్పక్షపాత విచారణ జరగాలని అప్పటివరకు ఈ ప్రక్రియపై నిరుద్యోగుల్లో ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.