

వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న రెండున్నరేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే 20 ఏళ్ల వరకు ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం నంది నగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించిందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. ప్రతి పనిలోనూ కమీషన్లు, కాసుల కక్కుర్తి కనిపిస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూములు, మైనింగ్ కుంభకోణాలకు స్వయంగా మంత్రులే పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
బీజేపీ ధరల పెరుగుదలపై నిరసన
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒక్కరోజే గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పైగా పెంచడం బీజేపీ నిర్వాకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై నిత్యావసర సరుకుల భారాన్ని మోపుతున్నారు. పెంచిన సిలిండర్ ధరను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతం - సభ్యత్వ నమోదు
ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై కూడా కేటీఆర్ విస్తృతంగా మాట్లాడారు. త్వరలో ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమం, అనంతరం చేపట్టే కమిటీల నిర్మాణంపై నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్రంలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పార్టీ చురుకుగా పాల్గొని ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల తొలగింపుకు అవకాశం ఉండొచ్చని, ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి నాయకుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని కేటీఆర్ సూచించారు. ఇటీవల పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి
శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు సిరిసిల్ల వాసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. శనివారం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద పార్థివ దేహాలను సందర్శించిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ నియోజకవర్గ వాసులను కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
