Let's talk: editor@tmv.in
మతాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రభుత్వ విధానం కాదు: మంత్రి పొంగులేటి

మతాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రభుత్వ విధానం కాదు: మంత్రి పొంగులేటి

Panthagani Anusha
1 జూన్, 2026

దేవుళ్లు, మతాల పేరుతో రాజకీయాలు చేయడం తమ ప్రజా ప్రభుత్వ విధానం కాదని అన్ని మతాల సంస్కృతిని ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు రూ. 3.30 కోట్ల వ్యయంతో ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తదితరులతో కలిసి మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతి మతానికి సమాన గౌరవం ఇస్తుందని చాటిచెప్పారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికీ తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని కేవలం ప్రకటనలకే పరిమితమై, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం భద్రాద్రి ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ఏకంగా రూ. 350 కోట్లు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ కోసమే ఇప్పటికే రూ. 68 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

యుద్ధప్రాతిపదికన భద్రాచలం అభివృద్ధి పనులు

రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. భద్రాచలంతో పాటు బాసర, వేములవాడ వంటి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం చిత్తశుద్ధితో, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరి నది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల సమగ్ర అభివృద్ధి కోసం బాసర నుంచి భద్రాచలం వరకు రూ. 1,000 కోట్లతో ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని, అందులో భాగంగానే నేడు గణపేశ్వరాలయం అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు.

మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు

ఆలయ అభివృద్ధి పనుల అనంతరం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో మంత్రి పొంగులేటి పర్యటించారు. అక్కడ రూ. 5.20 కోట్ల వ్యయంతో పొన్నెకల్లు నుంచి కొండాపురం వరకు నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని ప్రయాణ సమయం కూడా తగ్గనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.