Let's talk: editor@tmv.in
12 ఏళ్ల తర్వాత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు: సీఎం చంద్రబాబు

12 ఏళ్ల తర్వాత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
4 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాజకీయ నాయకులు చేసిన విమర్శలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మళ్లీ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ‘జాగిర్’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన నాయకుడైనా దేశంలో ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసుకునే ప్రజాస్వామ్య హక్కు ఉంటుందని, రాజకీయ పోటీ అనేది కేవలం ప్రజ సేవ, అభివృద్ధి చుట్టూనే సాగాలి తప్ప రెండు రాష్ట్రాల మధ్య అనవసర ఘర్షణలను సృష్టించేలా ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు సరైన విధానం కాదు. ఇటువంటి ప్రకటనలు అనవసరమైన సమస్యలను సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయి, ఇప్పుడు మనం రెండు వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్నాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు ఈ అంశాలను లేవనెత్తి ద్వేషాన్ని రెచ్చగొట్టలేరు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసు అని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

జాతీయస్థాయి రాజకీయల‌ను ప్రస్తావిస్తూ..

దేశవ్యాప్తంగా నాయకులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేసుకునే సంస్కృతిని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. తాను కూడా ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేశానని, అలాగే కర్ణాటకకు చెందిన నూత‌న‌ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో సహా దేశంలోని పలువురు అగ్రనేతలు తమ కూటముల తరఫున ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రచారం చేస్తున్నారని ఉదహరించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని, అందులో బీఆర్ఎస్ తనను తాను జాతీయ పార్టీగా ప్రకటించుకుని, ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించి మరింత ఎదుగుతామని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇప్పుడు వారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబునాయుడు నొక్కిచెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ఎన్నో దేశాలలో తెలుగువారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ, ఆయా దేశాల చట్టాల పరిధిలో ఉంటూనే నాయకత్వ పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎవరు సమర్థవంతంగా సేవ చేస్తారో వారే ఆయా ప్రాంతాల్లో నాయకులుగా ఎదుగుతారని, పోటీ అనేది కేవలం అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలను అందించడంపైనే ఉండాలని హితవు పలికారు.

వివాదానికి నేపథ్యం

హైదరాబాద్ నగరం ఎవరి సొంతం కాదని, తనను హైదరాబాద్‌లోకి రాకుండా అడ్డుకోవడానికి కొందరు తెలంగాణ స్థానిక రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు ఉందని పవన్ కళ్యాణ్ అంతకుముందు విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. నేను హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతానో చూస్తామని కొందరు నాయకులు అంటున్నారు. తెలంగాణ ఏమైనా మీ నాన్న జాగీరా? నన్ను బెదిరించడానికి మీరెవరు? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అలాగే, 2014లో జరిగిన రాష్ట్ర విభజన పద్ధతిగా జరగలేదని, రెండు వైపులా తగిన గౌరవం లేకుండా విభజించారనే అసంతృప్తి తమకు ఉందని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఎలాంటి సందేహం లేకుండా తెలంగాణ ఇక్కడి భూమిపుత్రులదే, ఇక్కడున్న నాలుగు కోట్ల ప్రజల జాగీరే. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఇక్కడే నివసించవచ్చు. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? గత 10, 12 ఏళ్లలో ఇక్కడ ఎక్కడైనా చిన్న సమస్య అయినా వచ్చిందా? మనం ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకున్నాం అని స్పష్టం చేశారు.