Let's talk: editor@tmv.in
హిట్లర్ ప్రేరణతో పాలన సాగుతోందా?: రేవంత్‌పై పినరయి విజయన్ విమర్శలు

హిట్లర్ ప్రేరణతో పాలన సాగుతోందా?: రేవంత్‌పై పినరయి విజయన్ విమర్శలు

Gaddamidi Naveen
9 జూన్, 2026

బెంగళూరులో శనివారం జరిగిన ఒక మీడియా సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా పనితీరును జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో రేవంత్ రెడ్డి ముడిపెట్టడం, ‘హైడ్రా’ అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం అని వ్యాఖ్యానించడంపై విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ మేరకు పినరయి విజయన్ సోమవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన ప్రజాస్వామ్య సమాజానికి ఎంతో దిగ్భ్రాంతికరమైనది, అవమానకరమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జాత్యహంకారి, నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ నుంచి ప్రేరణ పొంది, తెలంగాణలో తన 'బుల్డోజర్ రాజ్' ను అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ఈ 'హైడ్రా' వ్యవస్థను సృష్టించారని విజయన్ ఆరోపించారు.హిట్లర్ వంటి నియంత నుంచి స్ఫూర్తి పొందుతున్నామనే భావన కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా నమూనా ఏమిటో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హిట్లర్ లాగా ఎవరినైనా చంపగల సామర్థ్యం ఉన్న వ్యవస్థకు రేవంత్ రెడ్డి హిట్లర్ ఇష్టమైన పదాన్ని పెట్టారు. ఒక ప్రజాస్వామ్య దేశానికి ముఖ్యమంత్రిగా ఉండి, బహిరంగ వేదికపై ఈ విషయాన్ని ఒప్పుకోవడం అత్యంత దారుణం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాసిస్టును బహిరంగంగా ఆరాధించే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉండటం సిగ్గుచేటు అని విజయన్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను కేవలం ఒక “నోరు జారిన మాటలు”గా చూడలేమని, హిట్లర్ హంతక ముఠా నుంచి ప్రేరణ పొందుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైన ప్రజాస్వామ్య నమూనాతో పాలిస్తోందని ఆయన ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి గతంలో ఉన్న సంఘ్ పరివార్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. అలాంటి భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ సహించడమే కాకుండా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఫాసిస్టు విధానాలను కాంగ్రెస్ సమర్థవంతంగా వ్యతిరేకించలేదని వామపక్షాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయని, తాజా ఘటన ఆ వాదనకు బలం చేకూర్చిందని విజయన్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ పరిణామాన్ని గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.