Let's talk: editor@tmv.in
సాయికృష్ణ జీవించి ఉన్నాడా.. మరణించాడా?: వైఎస్ జగన్

సాయికృష్ణ జీవించి ఉన్నాడా.. మరణించాడా?: వైఎస్ జగన్

Gaddamidi Naveen
24 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యువకుడు గాదె సాయికృష్ణ 'అదృశ్యం' కేసుపై వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు ప్రశ్నలు సంధించారు. మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు.. సాయికృష్ణ జీవించి ఉన్నాడా? మరణించాడా? ఒకవేళ అతను మరణించి ఉంటే అతని మృతదేహం ఎక్కడ ఉంది? అని జగన్ నిలదీశారు. ఈ కేసులో నాలుగు రోజుల క్రితమే ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ, ఇప్పటివరకు ఎందుకు అరెస్టులు చేయలేదని మాజీ సీఎం జ‌గ‌న్ ప్రశ్నించారు.

విజయవాడ కృష్ణలంక పోలీస్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తన కుమారుడు సాయికృష్ణ (23) ను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా హింసించి చంపేశారని, ఆపై కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆరోపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు బ్రతికుంటే చూపించాలని, లేదంటే కనీసం అతని చితి బూడిదనైనా తనకు అప్పగించాలని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.

సిట్ ఏర్పాటు - సీబీఐ విచారణకు డిమాండ్

ఈ అదృశ్యం కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దర్యాప్తు కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు. జూన్ 19న అప్పటి కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ నాగరాజు (50) పై పోలీసులు 'హత్య' కేసు నమోదు చేయగా, ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. తదనంతరం, ఈ ఆరోపణలపై పారదర్శక, నిష్పక్షపాత విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అయితే, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తూ.. స్థానిక పోలీసులపైనే ఆరోపణలు ఉన్నందున వారు తమపై తాము విచారణ చేసుకోలేరని, ఈ కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

వెలుగులోకి మరో దారుణం.. దళిత యువకుడి ఆత్మహత్య

ఇదిలావుండగా, సాయికృష్ణ కేసుతో సంబంధం ఉన్న ఇదే ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపుల కారణంగా మరణించిన మరో దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను సోమవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ, ఇతర నేతలు పరామర్శించారు.

మంగళవారం ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ విషం తాగి ఆత్మహత్య చేసుకుంటూ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను దళిత సామాజిక వర్గానికి చెందినవాడిని కావడం వల్లే 6వ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆ వీడియోలో క్రాంతి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటన సమాజంలో ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మృతుడు క్రాంతి కుమార్ మలిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత కుమారుడు కావడం గమనార్హం. క్రాంతి కుమార్ తల్లి మరియమ్మ, భార్య ప్రభావతమ్మ, కుమార్తెను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము చట్టపరంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ రెండు ఘటనలు విజయవాడ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ట్యాగ్‌లు
SaiKrishnaSaiKrishnaCaseAndhraPradeshAPNewsBreakingNewsYSJaganJaganMohanReddyChandrababuNaiduYSRCPAndhraPoliticsCustodialDeath
సాయికృష్ణ జీవించి ఉన్నాడా.. మరణించాడా?: వైఎస్ జగన్ - Tholi Paluku