
అధికారంలో ఉన్నవారు విమర్శలను ఎదుర్కోలేకపోతే అది నాయకత్వమా:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైసీపీ నేత తాడిపత్రి ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోందని భావ ప్రకటనా స్వేచ్ఛ అంటేనే భయపడిపోతోందని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ కే. నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని, మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి తదితరులపై అక్రమంగా కేసులు పెట్టడం,సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం వంటి చర్యలే ఇందుకు నిదర్శనమని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను చూస్తుంటే “రెడ్ బుక్ పాలన” అంటే ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం విమర్శిస్తే బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. విభిన్న అభిప్రాయాలను సహించలేని అంతటి బలహీన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన ఆయన ప్రజల తరఫున మాట్లాడే వారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు అనేవి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మౌలిక హక్కులని చంద్రశేఖర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. “రెడ్ బుక్” పేరుతో భయ రాజకీయాలు నడపడం సరికాదని అధికారంలో ఉన్నవారు విమర్శలను తట్టుకోలేకపోతే అది నాయకత్వమే అనిపించుకోదని నిజంగా ప్రజల మద్దతు ఉంటే విమర్శల పట్ల ఇంత భయం ఎందుకని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యంలో కేవలం చప్పట్లు కొట్టేవాళ్లే కాకుండా లోపాలను ప్రశ్నించే గొంతులు కూడా ఉంటాయనే నిజాన్ని పాలకులు గ్రహించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం తన చేతకానితనాన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అక్రమ కేసులతో తాత్కాలిక సంతృప్తి పొందుతోందని చంద్రశేఖర్ విమర్శించారు. కేసులు, ఒత్తిళ్లు, బెదిరింపులతో ప్రజల గొంతును ఎవరూ శాశ్వతంగా నొక్కలేరని అధికార బలంతో ఈరోజు తప్పులు చేస్తున్న వారు భవిష్యత్తులో ప్రజల తీర్పును తప్పించుకోలేరని ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదని చంద్రశేఖర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
