
నీట్ లీకేజీపై ఆయన జోక్ చేస్తున్నారా?: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి
నీట్-యూజీ 2026 పరీక్ష వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన వివరణపై తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తి ప్రశ్నపత్రం లీక్ కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే లీక్ అయ్యాయన్న ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభిషేక్ సింగ్ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయని ఒప్పుకోవడమే పేపర్ లీకేజీకి నిదర్శనమని, దీనిని సమర్థించుకోవడం సరికాదని ఆయన అన్నారు.
ఆయన జోక్ చేస్తున్నారా? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాధానం ఇస్తూ.. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే లీక్ అయ్యాయని, అక్రమాల వల్లే పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఎన్‌టీఏ డీజీ చెబుతున్నారు. కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చాయంటే అది ప్రశ్నపత్రం లీకేజీ కాదా? అని రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్‌టీఏ నిర్లక్ష్యం వల్ల దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఇది పూర్తిగా విఫలమైన పరిపాలనకు నిదర్శనమని ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం పనులు మానేసి, లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది అని హితవు పలికారు.
ఎన్‌టీఏ వివరణ..
మరోవైపు పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిలు మాట్లాడుతూ.. ఈ లీకేజీ ఎన్‌టీఏ వ్యవస్థ లోపాల వల్ల జరగలేదని స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు సిఫార్సు చేసిన పలు సంస్కరణలను ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే పరీక్షకు ముందే బయటకు వచ్చాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. పోటీ పరీక్షలపై ప్రజల్లో నమ్మకం సడలకూడదనే ఉద్దేశంతోనే, తమ ‘జీరో-టాలరెన్స్’ విధానంలో భాగంగా పరీక్షను రద్దు చేసినట్లు అధికారులు కమిటీకి వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఫార్మాట్‌కు మార్చే ప్రతిపాదనలపై పార్లమెంటరీ కమిటీ చర్చించింది.
మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలలో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన ఈ పరీక్ష లీకేజీ వివాదం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 21న తిరిగి నీట్ పునఃపరీక్ష జరగనుంది.
