Let's talk: editor@tmv.in
ఐఆర్ఎస్ అధికారి కుమార్తె దారుణ హత్య

ఐఆర్ఎస్ అధికారి కుమార్తె దారుణ హత్య

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

ఢిల్లీలోని కైలాష్ హిల్స్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ నివసిస్తున్న ఒక సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి కుమార్తె (22)ను బుధవారం ఉదయం ఆమె నివాసంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

పోలీసుల కథనం ప్రకారం, యువతి ఇంటిలోని ఒక గదిలో మృతదేహంగా కనిపించగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షకు సిద్ధమవుతోంది. ప్రాథమిక విచారణలో, ఆమెపై లైంగిక దాడి చేసి, అనంతరం మొబైల్ ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పక్కాగా ప్లాన్ చేసి నేరం?

సంఘటన జరిగిన సమయంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు ప్రతిరోజు లాగే వాకింగ్‌కు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కుటుంబంతో సుమారు ఎనిమిది నెలలుగా పనిచేసిన 19 ఏళ్ల ఇంటి పనివాడు రాహుల్ మీనా ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. కొంతకాలం క్రితం రోజువారీ కొనుగోలు బిల్లుల్లో తప్పుడు లెక్కలు చూపాడన్న ఆరోపణలతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిసింది. మీనాకు ఆ ఇంటి అంతర్గత నిర్మాణం, కుటుంబ సభ్యుల దినచర్యలపై పూర్తి అవగాహన ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఎప్పుడు బయటకు వెళ్తారో అతనికి ముందుగానే తెలుసని సమాచారం.

పరారీలో నిందితుడు… గాలింపు ముమ్మరం

దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు యువతిపై దాడి చేసి, ఆమెను కర్రతో కొట్టడంతో ముఖం, తలపై గాయాలు అయ్యాయి. అనంతరం ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడని, అతని ఆచూకీ కోసం పలు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. సమీప ప్రాంతంలోని ఒక కార్ క్లీనర్‌, మరో ఇంటి పనిమనిషిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో సాక్ష్యాలను సేకరించగా, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

భద్రతపై స్థానికుల ఆందోళన

ఈ దారుణ ఘటనతో కైలాష్ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నివాస ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.