Let's talk: editor@tmv.in
ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: ఏపీ సీఎం

ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: ఏపీ సీఎం

Panthagani Anusha
19 మే, 2026

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, శంకుస్థాపనలను ఇరిగేషన్ క్యాలెండర్‌కు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రకటించిన 25 ప్రాధాన్యతా ప్రాజెక్టులతో పాటు మరో 11 ప్రాజెక్టులను కూడా ఇరిగేషన్ క్యాలెండర్‌లో చేర్చి పనులు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, సివిల్ పనులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పోలవరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి

ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం సివిల్ పనులు 88 శాతం, భూసేకరణ 93 శాతం పూర్తయ్యాయని నిర్వాసితుల పునరావాసం 45 శాతం మేర పూర్తయిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2నాటికే డయాఫ్రం వాల్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్-1, 2 పనులను 2027 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా పోలవరం కుడికాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు కూడా 85 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై ప్రతి నెలా పోలవరం పనుల పురోగతిని తానే స్వయంగా సమీక్షిస్తానని స్పష్టం చేశారు. జూలై నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ నుంచి నీటి సరఫరా ప్రారంభించాలని ఆదేశించారు. మేఘాద్రిగడ్డ నుంచి చంపావతి వరకు వంశధార, నాగావళి నదుల ద్వారా నీటి అనుసంధాన సాధ్యాసాధ్యాలపై తక్షణమే అధ్యయనం చేయాలని సూచించారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్రక్రియను చట్టబద్ధంగా వేగంగా పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితుల తరలింపు ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. అంతేకాకుండా పోలవరం స్పిల్‌వే దిగువన ఒక 'ఐకానిక్ బ్రిడ్జి'ని నిర్మించి ఆ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

వెలిగొండ, హంద్రినీవా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను రానున్న జూలై నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెడ్‌వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ మరియు ఆర్ అండ్ ఆర్ పనుల కోసం ఇంకా రూ.2,019 కోట్లు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, టీబీఎంను తొలగించి ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. రాయలసీమ పరిధిలోని పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని, అడవిపల్లి, శ్రీనివాసపురం ప్రాజెక్టుల నుంచి నీవా కాలువ ద్వారా చిత్తూరుకు తాగు, సాగు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హంద్రినీవా సుజల స్రవంతి ఫేజ్-1లో కాలువల విస్తరణ పనులు 92 శాతం, ఫేజ్-2లో కుప్పం-పుంగనూరు కాలువల లైనింగ్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మల్యాల లిఫ్ట్ ద్వారా తొలిసారిగా రాయలసీమకు 52 టీఎంసీల నీటిని తరలించి రికార్డు స్థాయిలో 432 చెరువులను నింపినట్లు తెలిపారు. కాగా జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సాగునీటి రంగంపై రూ.2,123 కోట్లు వ్యయం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఖరీఫ్‌కు ముందస్తు ప్రణాళికలు.. భూగర్భ జలాల పెరుగుదల

రాబోయే ఖరీఫ్ సాగు కాలానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం మైనస్ 3 శాతంగా నమోదైనప్పటికీ భూగర్భ జలాల స్థాయి 9.49 మీటర్లుగా ఉందని ఇది గత ఏడాదితో పోలిస్తే 0.5 మీటర్లు మెరుగ్గా ఉందని అధికారులు వివరించారు. కృష్ణా డెల్టాలో సాగు సీజన్ ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలుగా ముందస్తుగానే నీటిని విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. గతంలో పట్టిసీమ ద్వారా నీటి సరఫరా చేసి అద్భుతమైన ఫలితాలు సాధించామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మైక్రో ఇరిగేషన్ (బిందు, తుంపర సేద్యం) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్రంలో 'జలధార-జలహరతి' కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, నీటి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం ఏటా రూ.17 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోందని, జల సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలు మరింత పెరిగితే విద్యుత్ వినియోగ భారం ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.