Let's talk: editor@tmv.in
ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Gaddamidi Naveen
3 మే, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి నివేదిక' కార్యక్రమం ప్రజలను వంచించేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందని వివేకానంద ఆరోపించారు. ఆర్థికంగా స్థిరపడిన వారికే ఇళ్లు ఇస్తున్నారు. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే ఒక లబ్ధిదారురాలు.. తన కొడుకు లండన్‌లో ఉన్నాడని, బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పడమే దీనికి నిదర్శనం అని ఆయన ఎద్దేవా చేశారు. నిజమైన పేదలను కాదని, అనర్హులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం దారుణమని విమర్శించారు.

ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం గతంలో వచ్చిన దరఖాస్తులకే పరిమితమైందని, పెన్షన్లు, ఇండ్లు, స్థానిక సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోగా, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకూ నిర్లక్ష్యం పెరిగిందని ఆరోపించారు. 99 రోజుల ప్రణాళికకు నిధులు లేవని, స్పష్టమైన కార్యాచరణ కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. 900 రోజులు గడిచినా ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమీక్ష కూడా చేసుకోలేదన్నారు.

ముఖ్యమంత్రి శాఖల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యతో ప్రజలు రోడ్డెక్కుతున్నారని, విద్యాశాఖ, హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్యా వ్యవస్థలో అయోమయం, శాంతిభద్రతల విషయంలో అనిశ్చితి నెలకొన్నాయని అన్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేక ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు లేక ప్రజలు బిందెలతో రోడ్డెక్కుతున్నారని, గతంలో కేసీఆర్ నీళ్లిచ్చాకే ఓట్లు అడిగారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ సాదాసీదా నాయకుడు కాదని, ఆయనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఆమె తీరును గమనిస్తోందని హెచ్చరించారు.