
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. త్వరలో కఠిన చట్టాలు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
దేశవ్యాప్తంగా సాగును శాసిస్తున్న నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందుల మాఫియాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపదం మోపనుంది. అన్నదాతలను నిలువునా ముంచుతున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు వీలుగా అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన నూతన చట్టాలను తీసుకురావడానికి రంగం సిద్ధం చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే 'సీడ్ యాక్ట్', 'పెస్టిసైడ్ యాక్ట్' బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నకిలీ ఉత్పాదకాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకాడబోదని హెచ్చరించారు.
ఉత్తర రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లోని శిక్షలు నామమాత్రంగా ఉండటం వల్లే అక్రమార్కులకు భయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కొత్త చట్టాల ముసాయిదాపై ఇప్పటికే వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించామని త్వరలోనే ఇవి చట్ట రూపం దాల్చుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా నకిలీలపై ప్రత్యేక తనిఖీలు ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతుల ఆదాయం పెంపు ఆహార భద్రత లక్ష్యంగా ఆరు అంశాల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
దేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ వ్యూహాలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. “జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసే విధానం తమిళనాడుకు సరిపోదు.. అందుకే జాతీయ స్థాయిలోనే కాకుండా, ప్రాంతాల వారీగా చర్చలు జరిపి ప్రత్యేక రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నాం” అని స్పష్టం చేసారు. ఉత్పత్తి పెంపుతో పాటు, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదేవిదంగా బియ్యం ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
అయితే ఎరువుల అధిక వినియోగంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రసాయన ఎరువుల వాడకం మితిమీరిపోతోందని ఇది నేల ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరించారు. రైతులు ప్రాకృతిక, సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని ఉద్యానవన, ఔషధ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసిన మెరుగైన విత్తన రకాలు రైతులకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రాలకు కీలక సూచనలు
రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వ సేవలు నేరుగా అందేలా 'ఫార్మర్ ఐడీ' నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదేవిదంగా కిసాన్ క్రెడిట్ కార్డులు పొందని రైతులందరికీ ఆ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ సదస్సులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
