Let's talk: editor@tmv.in
సైబర్ నేరాలపై ఉక్కుపాదం.. ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థకు సీఎం ఆదేశం

సైబర్ నేరాలపై ఉక్కుపాదం.. ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థకు సీఎం ఆదేశం

Panthagani Anusha
31 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌ను సైబర్ నేరాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 'సైబర్ వార్ రూమ్'ను రాబోయే 30 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసేలా సరికొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సైబర్ నేరాలు జరిగినప్పుడు మొదటి గంట సమయం (గోల్డెన్ హౌర్) అత్యంత కీలకమని ఆ సమయంలో వేగంగా స్పందిస్తే బాధితుల సొమ్మును కాపాడవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేవలం 10 నిమిషాల్లోనే సంబంధిత బ్యాంకులకు సమాచారం చేరవేసేలా సాంకేతికతను అనుసంధానించాలని సూచించారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో 30 నిమిషాల సేవా స్పందన ఒప్పందాలు కుదుర్చుకోవాలని దీనివల్ల నిధుల బదిలీని సకాలంలో నిలిపివేసి మోసపూరిత లావాదేవీలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని సీఎం వివరించారు.

కాగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టంలో అసలు 'డిజిటల్ అరెస్ట్' అనే భావనే లేదని ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది లేదా సీబీఐ అధికారులమంటూ నటిస్తూ అమాయక ప్రజల జీవితకాల పొదుపు మొత్తాలను దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ తరహా ముఠాల ఆటకట్టించేందుకు బ్యాంకులు, పోలీసు శాఖ, ఏపీటీఎస్ ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు.

సమావేశం సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రతిపాదిత "ఆంధ్రప్రదేశ్ సైబర్ గార్డ్" కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు ప్రధాన స్తంభాల (సైబర్ వార్ రూమ్, 1930 హెల్ప్‌లైన్ డ్యాష్‌బోర్డ్, ఏఐ సాంకేతికత, సిబ్బంది సామర్థ్యాభివృద్ధి, త్రిస్థాయి నిర్మాణం, ప్రజా అవగాహన) ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. మంగళగిరిలోని ప్రభాల టెక్ పార్క్‌లో రాష్ట్ర స్థాయి సైబర్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి 30 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందులో అత్యవసర స్పందన, సైబర్ ముప్పుల విశ్లేషణ, న్యాయపరమైన అనుసరణతో కూడిన 11 ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయని డీజీపీ పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌తో అనుసంధానించి మరింత బలోపేతం చేయనున్నారు. ఆర్‌బీఐ సహకారంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ‘మ్యూల్ హంటర్.ఏఐ’ అనే అత్యాధునిక వ్యవస్థను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు వాడే నకిలీ, అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను ముందే గుర్తించి నిలిపివేయవచ్చు.

అయితే రాబోయే ఏడాది కాలంలో 500 మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక సైబర్ శిక్షణ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లు, నాలుగు ప్రాంతీయ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే ఏపీ సీఐడీ, ఏపీటీఎస్ బృందాలు ఢిల్లీలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4సీ) ను సందర్శించి అక్కడి అత్యాధునిక విధానాలను అధ్యయనం చేశాయని తెలిపారు. దర్యాప్తుతో పాటు సైబర్ పెట్రోలింగ్ పెంచాలని ప్రజల్లో అప్రమత్తత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 3,000 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.