


ఇరాన్ పతనం అంచున ఉంది: ట్రంప్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశం ప్రస్తుతం పతనం అంచున ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ స్వయంగా తమకు ఈ సమాచారాన్ని అందించిందని, సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికా సాయం కోరిందని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌తో ప్రకంపనలు
అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇరాన్ పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ చేశారు. "ఇరాన్ ఇప్పుడే మాకు సమాచారం ఇచ్చింది. ఆ దేశం పతనం అంచున ఉంది. అక్కడ నాయకత్వ మార్పులు, అంతర్గత విభేదాలు పరిష్కరించుకునే వరకు హర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని వారు కోరుతున్నారు" అని ట్రంప్ రాశారు. ఇరాన్ ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమిస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో అత్యధిక భాగం హర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు భారీగా పెరగడంతో సామాన్యులపై భారం పడింది. ఇప్పుడు ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినడంతో ఈ మార్గాన్ని తిరిగి తెరవాలని అమెరికాను కోరుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
పాకిస్థాన్ ద్వారా రాయబారం
ఇరాన్ తన ప్రతిపాదనలను నేరుగా కాకుండా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు పంపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ దౌత్యపరమైన పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రతిపాదనలపై అమెరికా జాతీయ భద్రతా బృందం ప్రస్తుతం తీవ్రంగా చర్చిస్తోంది.
ఆంక్షల ఎత్తివేతపై ప్రతిష్టంభన
యుద్ధాన్ని ఆపేందుకు, హోర్ముజ్ మార్గాన్ని తెరిచేందుకు అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను తొలగించాలని ఇరాన్ కోరుతోంది. అయితే దీనికి ప్రతిగా తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు పెట్టింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా వ్యతిరేకించారు. అణు శుద్ధీకరణపై స్పష్టమైన హామీ లేకుండా ఎటువంటి ఒప్పందం కుదరదని ఆయన తేల్చి చెప్పారు.
అణు ముప్పుపై వెనక్కి తగ్గేది లేదు
"ఇరాన్ ఎప్పుడైనా అణ్వాయుధాలను తయారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వారు అణ్వాయుధాల దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునే బలమైన ఒప్పందం ఉంటేనే మేము ముందుకు వెళ్తాము" అని రూబియో స్పష్టం చేశారు. అణు నిల్వలపై పట్టు బిగించకుండా ఆంక్షలు ఎత్తివేస్తే, ఇరాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి తగ్గుతుందని అమెరికా భయపడుతోంది.
మా దేశం పతనం అవ్వదు: ఇరాన్
మరోవైపు భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయేనియా భిన్నమైన వాదన వినిపించారు. "మా దేశం పతనం అవ్వదు, కచ్చితంగా విజయం సాధిస్తుంది. అమెరికా అనవసరంగా కాలయాపన చేస్తోంది. యుద్ధం ముగియాలంటే మేము ప్రతిపాదించిన 10 షరతులను వారు అంగీకరించాల్సిందే" అని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని జియాయేనియా మండిపడ్డారు. ఇరాన్ ఇంధన వనరులపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ దేశ సుప్రీం లీడర్ ప్రాణాలకు ముప్పు తలపెట్టేలా వ్యవహరించడంపై అంతర్జాతీయ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
ఇరాన్ ప్రజలు తమ సైన్యానికి, ప్రభుత్వానికి వెన్నంటే ఉన్నారని జియాయేనియా అన్నారు. వీధుల్లో ప్రజలు నిరంతర నినాదాలతో తమ మద్దతు తెలుపుతున్నారని, అటువంటి దేశాన్ని ఎవరూ ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అమెరికా ఆర్థిక ఇబ్బందులు
హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో ట్రంప్ ప్రభుత్వంపై దేశీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్‌ను లొంగదీసుకోవడమా లేక ధరలను అదుపు చేసేందుకు ఒప్పందానికి రావడమా అన్న సందిగ్ధంలో అమెరికా ఉంది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. "అధ్యక్షుడు తన భద్రతా బృందంతో చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పలేము కానీ, దానిపై చర్చలు మాత్రం జరుగుతున్నాయి" అని తెలిపారు. కాగా ట్రంప్ స్వయంగా దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.
