
ఐపీఎల్ టికెట్ల దందా.. ముగ్గురు అరెస్ట్
వీవీఐపీలు, వీఐపీల లెటర్ హెడ్‌లను ఫోర్జరీ చేసి, ఉచిత ఐపీఎల్ టికెట్లను పొంది వాటిని భారీ ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు కొందరు వ్యక్తులు టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా ఒక్కొక్కటి రూ.22,000 విలువైన ఐదు కాంప్లిమెంటరీ (ఉచిత) టికెట్లు లభించాయి.
పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తమిళనాడుకు చెందిన మరో ముగ్గురితో కలిసి వీరు ఈ పథకం వేశారు. న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐపీలు, వీఐపీల అధికారిక లెటర్‌హెడ్‌లను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేశారు. అనంతరం వాటిపై వారి సంతకాలను నకిలీగా రూపొందించి, ఆ పత్రాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సమర్పించారు. ఈ విధంగా అధిక విలువ గల టికెట్లను పొందిన వారు వాటిని మరింత ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది.
నిందితుల నుంచి ఒక కారు, ఐదు ఐపీఎల్ టికెట్లు, ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు.
