
రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.11.77 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి టీజీ భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. గత రెండేళ్ల కాలంలో వివిధ రంగాలలో కలిపి ఏకంగా రూ.11.77 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం లభించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 10.32 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన అంచనా వేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిశ్రామిక వృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కంపెనీలు సమర్పించే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఆధారంగానే భూములను కేటాయిస్తామన్నారు. ఈ నివేదికలను స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ), స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (ఎస్‌ఐపీసీ) లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఆమోదం కోసం రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టుల పురోగతిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, పనులలో అనవసర జాప్యం జరిగితే సదరు సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల, ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన 'జొన్నగిరి గోల్డ్ మైన్' ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ చైర్మన్ బి. ప్రభాకరన్ కలిసి ఇటీవల ఉమ్మడిగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో వాణిజ్య స్థాయిలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బంగారు గని ఇదే కావడం విశేషం.
'జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' చే అభివృద్ధి చేయబడి, లాయిడ్స్ మెటల్స్ త్రివేణి గ్రూప్ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గని విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటిగా ఉన్న తరుణంలో, ఈ జొన్నగిరి ప్రాజెక్టు దేశీయంగా బంగారు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఏపీ పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
