
నాసిక్ టీసీఎస్ కేసులో దర్యాప్తు ముమ్మరం
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) శాఖలో మహిళా ఉద్యోగుల వేధింపుల కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు చేసిన పదుల సంఖ్యలో ఫిర్యాదులను కంపెనీ అధికారులు పట్టించుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రకారం, బాధితులు పంపిన 70కి పైగా సందేశాలను హెచ్‌ఆర్ మేనేజర్ ఉన్నతాధికారులకు పంపకుండా నిర్లక్ష్యం చేసినట్లు ఆధారాలు లభించాయి. హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారిగా వ్యవహరించి ఫిర్యాదులను అణచివేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాల్ రికార్డులు, చాట్స్ స్వాధీనం
దర్యాప్తులో భాగంగా పోలీసులకు సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈ మెయిల్స్, చాట్ సందేశాలు లభించాయి. వీటిలో నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సూచించే సమాచారం కూడా ఉందని అధికారులు తెలిపారు. బాధితులు చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని హెచ్‌ఆర్ మేనేజర్ పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో వెల్లడైంది. కార్యాలయంలోని పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరస్‌మెంట్)కమిటీ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఆమె తగిన చర్యలు తీసుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఏజీఎం పాత్రపై అనుమానం
టీసీఎస్ నాసిక్ శాఖలోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా ఈ కేసులో అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదైన తరువాత కూడా ఆయన ప్రధాన నిందితుడు డానిష్ షేక్‌తో సంప్రదింపులు కొనసాగించినట్లు కాల్ రికార్డులు సూచిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి, ముంబై నాకా పోలీస్ స్టేషన్‌లో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి.
జైలులో నిందితులు
ప్రధాన నిందితుడు డానిష్ షేక్‌తో పాటు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, రజా మెమన్, తౌసీఫ్ అత్తార్, షారుక్ ఖురేషి ప్రస్తుతం నాసిక్ రోడ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌ను ఏప్రిల్ 13న కోర్టు పోలీస్ కస్టడీకి పంపింది. ఈ ఘటనపై నటరాజన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్ చైర్మన్) ఆదేశాల మేరకు కంపెనీ అంతర్గత విచారణ కూడా ప్రారంభమైంది. ఈ ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు 40కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితులు, నిందితుల వాంగ్మూలాలు కూడా నమోదు చేస్తున్నారు. ఒక నిందితుడిని పట్టుకునేందుకు మహిళా పోలీసులతో అండర్‌కవర్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేసు అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
