Let's talk: editor@tmv.in
పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రత్యేక సెల్: సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రత్యేక సెల్: సీఎం రేవంత్ రెడ్డి

పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రత్యేక సెల్: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
21 మే, 2026

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ఒక ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, దానికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను తక్షణమే సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పెట్టుబడిదారులకు అన్ని రకాల అనుమతులు వేగంగా వచ్చేలా సౌకర్యం కల్పించడానికి ఒక 'ఎస్కార్ట్ ఆఫీసర్' వ్యవస్థను తీసుకురావాలని, అలాగే పారిశ్రామిక విధానాలలో ముందంజలో ఉన్న తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

1,500 ఎకరాల్లో ‘డేటా సిటీ’ - గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు

రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఒక ‘డేటా సిటీ’ ని ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఐటీ, పారిశ్రామిక రంగాన్ని కేవలం హైదరాబాద్ మహానగరానికే పరిమితం చేయకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ డేటా సిటీ పరిసరాల్లో జీసీసీ, డేటా సెంటర్ల స్థాపన కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని చెప్పారు.

హైదరాబాద్ వెలుపల జీసీసీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘జీసీసీ పాలసీ’ ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ అవతలి ప్రాంతాలను గుర్తించి, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్-జీరో విధానాలు

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సదుపాయాలతో ఉండేలా ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఇక్కడ ఏర్పాటయ్యేలా కేంద్రంతో చర్చలు జరపాలని, అవసరమైతే తానే స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడుతానని సీఎం చెప్పారు. వివిధ కంపెనీల ప్రాంగణాల శంకుస్థాపనలకు తగిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయ‌న తెలిపారు.

ఈ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ నగరాల నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ సంస్థలకు నిలయంగా మారాలని ఆకాంక్షించారు. రాబోయే జూన్ నెలలో ఈ ఫ్యూచర్ సిటీలో ఒక ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేయాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాతే భూముల కేటాయింపులు జరపాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం తరఫున 500 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు వెల్లడించారు.

హైస్పీడ్ రైల్ కారిడార్ భూసేకరణ

కేంద్ర బడ్జెట్-2026 లో ప్రకటించిన ఏడు కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్ల అమలును వేగవంతం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత మార్గాలలో ముంబ్తె-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి కారిడార్లు ఉన్నాయి. దేశంలోని ప్రధాన ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాలను అనుసంధానించే ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం హైదరాబాద్ నగర శివార్లలో తక్షణమే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్

రాబోయే మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆపరేటర్లకు బదులుగా టి-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను మాత్రమే వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టి-ఫైబర్‌కు మారడం ద్వారా రూ.54 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ & ఎండీ కె. శశాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.