Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీకి అంతర్జాతీయ పురస్కారం.. చంద్రబాబు అభినందనలు

ప్రధాని మోడీకి అంతర్జాతీయ పురస్కారం.. చంద్రబాబు అభినందనలు

Panthagani Anusha
19 మే, 2026

ప్రధాని నరేంద్ర మోడీకి స్వీడన్ ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత గౌరవ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారత్-స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన విశేష కృషి, దూరదృష్టి నాయకత్వానికి గుర్తింపుగా ప్రధాని మోదీకి ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ ఆఫ్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ ప్రధాని మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రపంచ నాయకులకు స్వీడన్ ప్రదానం చేసే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత ప్రతిష్ఠను సంపాదించిందని కొనియాడారు.

కాగా ఇది ప్రధాని మోడీకి లభించిన 31వ అంతర్జాతీయ గౌరవమని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రపంచ దేశాలతో భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ప్రధాని కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సహకారం, స్నేహపూర్వక దౌత్య సంబంధాల విస్తరణలో ఆయన కృషికి ఈ పురస్కారం నిదర్శనమన్నారు.

ఇదిలా ఉండగా ప్రధాని కూడా తన స్వీడన్ పర్యటనపై స్పందించారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు, సానుకూల ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. భారత్-స్వీడన్ సంబంధాలకు ఈ పర్యటన కొత్త ఊపును తీసుకువస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతికత, వాణిజ్యం, ఆవిష్కరణలు, హరిత శక్తి వంటి రంగాల్లో భారత్-స్వీడన్ సహకారం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.