Let's talk: editor@tmv.in
సింగపూర్ పుంగోల్ తరహాలో అమరావతిలో సమగ్ర టౌన్‌షిప్‌: మంత్రి నారా లోకేష్

సింగపూర్ పుంగోల్ తరహాలో అమరావతిలో సమగ్ర టౌన్‌షిప్‌: మంత్రి నారా లోకేష్

Panthagani Anusha
12 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సింగపూర్‌లోని పుంగోల్ తరహాలో అమరావతిలో ఒక సమగ్ర టౌన్‌షిప్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో దేశానికే ఒక ఆదర్శ పట్టణ అభివృద్ధి నమూనాగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ అక్కడి వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగపూర్ సహకారంతో అమరావతి ఎకానామిక్ రీజియన్‌ను అత్యుత్తమ పారిశ్రామిక, ఆర్థిక హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. అమరావతికి జాతీయ స్థాయిలో చట్టబద్ధత లభించడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులలో నమ్మకం పెరిగిందని దీనిని అందిపుచ్చుకోవడానికి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.

ప్రపంచ బ్యాంకు మద్దతుతో ముందడుగు

అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ మద్దతును కూడా పొందాలని జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీకి లోకేష్ సూచించారు. ఇప్పటికే రాజధాని ఎకానామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి ఆసక్తి ఉన్న భాగస్వాముల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. సింగపూర్ ద్వారా ఆగ్నేయ, తూర్పు ఆసియా దేశాలు ఏపీ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్లోబల్ హబ్‌గా ఏపీ

రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ హబ్‌గా మార్చేందుకు సింగపూర్‌లోని సన్‌టెక్ సిటీ తరహా మోడల్‌ను పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్‌ను బలోపేతం చేసేందుకు సింగపూర్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.