Let's talk: editor@tmv.in
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ..బ్యాంకులతో కీలక ఒప్పందాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ..బ్యాంకులతో కీలక ఒప్పందాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ..బ్యాంకులతో కీలక ఒప్పందాలు

Dantu Vijaya Lakshmi Prasanna
26 జూన్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా సౌకర్యాల కల్పన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులకు నమ్మకం, భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు గానూ 16 ప్రముఖ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవగాహనా ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకుంది. సింగరేణి కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించామని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ అడగకపోయినా ఈ భద్రతను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

గత పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని, వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి తారీఖునే వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచడం వల్ల 2024 నుంచి పదవీ విరమణ బెనిఫిట్స్ భారీగా పేరుకుపోయాయని, అయినప్పటికీ ఉద్యోగులను చిన్నచూపు చూడకుండా ప్రతి నెలా రూ. 200 కోట్ల నుంచి రూ. 700 కోట్ల వరకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని మాట ఇచ్చి, అందులో భాగంగా మొదటి విడతగా రూ. 1000 కోట్లు విడుదల చేశామని, పీఆర్సీ విషయంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల శ్రమ ఎంతో అమూల్యమైనదని ముఖ్యమంత్రి కొనియాడారు. నిరుపేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 47 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, నాణ్యమైన విద్య, మహిళా సంఘాలకు రూ. 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ వంటి విప్లవాత్మక పథకాల విజయవంతానికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రశంసించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినప్పటికీ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వెనకడుగు వేయలేదని తెలిపారు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో నిలబడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు ఎంతో కీలకమని, అయితే కొందరు రాజకీయ కారణాలతో ఈ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులు, భారత్ ఫ్యూచర్ సిటీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. అక్రమార్కులను అరికట్టి, పన్నుల ఎగవేతదారులను పట్టుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు.

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మహా యజ్ఞంలో ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని, రోజుకు ఒక గంట అదనంగా పనిచేసి రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని కోరారు. పెరిగిన ఆదాయాన్ని తిరిగి ఉద్యోగుల అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, పలు బ్యాంకుల ప్రతినిధులు ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaNewsRevanthReddyEmployeeInsuranceGovernmentEmployeesTelanganaGovernmentEmployeeWelfareInsuranceSchemeMoUPublicSectorEmployeesSingareniRTCEmployeesTelanganaPoliticsBreakingNewsHyderabadNews