Let's talk: editor@tmv.in
ప్రధానికి వినూత్నంగా కృతజ్ఞతలు: హయత్ నగర్‌లో 3డీ ఇసుక కళాఖండంతో ‘నారీ శక్తి’ సందడి
ప్రధానికి వినూత్నంగా కృతజ్ఞతలు: హయత్ నగర్‌లో 3డీ ఇసుక కళాఖండంతో ‘నారీ శక్తి’ సందడి

ప్రధానికి వినూత్నంగా కృతజ్ఞతలు: హయత్ నగర్‌లో 3డీ ఇసుక కళాఖండంతో ‘నారీ శక్తి’ సందడి

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ, పార్లమెంట్‌లో జరుగుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మహిళా మోర్చా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. హయత్ నగర్‌లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో భారీ ఎత్తున 'నారీ శక్తి వందన్' కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలులోకి తెస్తున్నందుకు గుర్తుగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3డీ ఇసుక రంగోలి ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మల్కా కోమరయ్య, డాక్టర్ శిల్పా రెడ్డి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, లోక్‌సభ, రాజ్యసభల్లో 'నారీ శక్తి వందన్ అధినియం'పై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దశాబ్దాల తర్వాత మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తోంది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరగబోతోందని ఆయన పేర్కొన్నారు. ఇది తమ వరుస కార్యక్రమాల్లో 8వ కార్యక్రమం అని వెల్లడించారు.

అలాగే డాక్టర్ శిల్పా రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ మహిళా మోర్చా తరపున స్కూటీ ర్యాలీలు, పాదయాత్రలు, సమ్మేళనాల ద్వారా ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో రూపొందించిన ఇసుక కళాఖండం మోడీకి మహిళా లోకం తరపున ఇస్తున్న ఘన నివాళి అని అన్నారు. వికసిత్ భారత్ కేవలం మహిళా అభివృద్ధి మాత్రమే కాదు, మహిళా నేతృత్వంలోని పాలనతో సాధ్యమవుతుందని మోడీ నిరూపించారు. ఈ చట్టం వల్ల పార్లమెంట్‌లో 273 మంది మహిళలు, తెలంగాణ అసెంబ్లీలో సుమారు 60 మంది మహిళలు ప్రాతినిధ్యం వహించబోతున్నారు అని ఆమె గర్వంగా ప్రకటించారు.

చారిత్రక సంస్కరణల ప్రస్తావన

గత ప్రభుత్వాలు దశాబ్దాల కాలం అధికారంలో ఉన్నా మహిళా బిల్లును పట్టించుకోలేదని, కానీ మోడీ ప్రభుత్వం పదేళ్ల కాలంలోనే అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ నిషేధం వంటి సాహసోపేత నిర్ణయాలతో పాటు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను కూడా తీసుకువచ్చిందని నేతలు కొనియాడారు.

ప్రస్తుతం లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 పై చర్చలు కొనసాగుతున్నాయి. దీనితో పాటు లోక్‌సభ స్థానాలను 850కి పెంచే పునర్విభజన బిల్లు కూడా పరిశీలనలో ఉంది. అంతకుముందు జరిగిన 12 గంటల సుదీర్ఘ చర్చలో ప్రధాని మోడీ, అమిత్ షా పాల్గొనగా, విపక్ష నేతలు అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ, కె.సి. వేణుగోపాల్ పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే ప్రాతినిధ్య నష్టంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఓటింగ్‌లో ఈ బిల్లుల ప్రవేశానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. మహిళా లోకానికి రాజకీయ సార్వభౌమాధికారం కల్పించే ఈ చట్టాన్ని స్వాగతిస్తూ, తెలంగాణ మహిళా మోర్చా తన మద్దతును ఘనంగా చాటిచెప్పింది.