

రాయలసీమలో పరిశ్రమల విప్లవానికి శ్రీకారం: సీఎం చంద్రబాబు
రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసేలా వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రతిష్టాత్మక ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు శుక్రవారం అధికారికంగా చారిత్రాత్మక శ్రీకారం చుట్టారు. జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయబోతున్న ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ భారీ సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ‘జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్’ సంస్థ రెండు దశల్లో, సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో, మొత్తం రూ. 16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనుంది. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో పనులు చేపట్టనుండగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండు దశలు పూర్తయ్యాక కర్మాగారం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2 మిలియన్ టన్నులకు (2 ఎంఎటీపీఏ) చేరుకోనుంది. ఈ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని 2028 మార్చి నాటికి ప్రారంభించడమే లక్ష్యంగా నిర్ణయించారు. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ‘గ్రీన్ స్టీల్’ సదుపాయంగా ఈ ప్లాంట్‌ను డిజైన్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించేందుకు వీలుగా.. పునరుత్పాదక ఇంధనంతో పనిచేసే 'స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెస్' సాంకేతికతను ఇక్కడ ఉపయోగించనున్నారు.
కూటమి ప్రభుత్వంతోనే ప్రాజెక్టు పునరుద్ధరణ
ఈ ప్రాజెక్టుకు నిజానికి 2019లోనే ఆమోదం లభించిందని, గతంలో 2019లో ఒకసారి, మళ్లీ 2023లో ఒకసారి దీనికి శంకుస్థాపనలు జరిగాయని ప్రభుత్వ ప్రకటన గుర్తుచేసింది. అయితే, 2024లో రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంతో నిరంతరం జరిపిన చర్చలు, ప్రత్యేక చొరవ వల్ల ఈ ప్రాజెక్టుకు మళ్లీ ‘జీవం’ పోసి, పనులు ప్రారంభించేలా పునరుద్ధరించామని స్పష్టం చేసింది.
ఈ కర్మాగారానికి అవసరమైన అత్యంత కీలకమైన బాహ్య మౌలిక సదుపాయాలను ప్రభుత్వం శరవేగంగా కల్పిస్తోంది. ప్లాంట్ కోసం ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారి-67 కనెక్టివిటీ పనులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. పీఎం గతి శక్తి చొరవ కింద ‘రైట్స్’ సంస్థ ద్వారా ముద్దనూరు రైల్వే స్టేషన్ నుంచి ఈ స్టీల్ ప్లాంట్‌కు కలుపుతూ 12 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లింక్ లైన్ పనులను కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. దీనివల్ల రాయలసీమ అంతటా ఎన్నో అనుబంధ పరిశ్రమలు వస్తాయని, దేశంలోనే ప్రముఖ ఉక్కు ఉత్పత్తి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం ఉద్యానవన పంటలకు, అరుదైన ఖనిజాలకు, గ్రీన్ ఎనర్జీకి నిలయంగా మారిందని ప్రకటించారు. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్, కియా కార్ల వంటి అంతర్జాతీయ బ్రాండ్ల తయారీ పరిశ్రమలు ఇక్కడ విజయవంతంగా నడుస్తున్నాయని గుర్తుచేశారు.
రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతానికి స్పేస్ (అంతరిక్షం), ఏరోస్పేస్, డిఫెన్స్ (రక్షణ రంగం), డ్రోన్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధనం, ఆహార శుద్ధి వంటి రంగాలకు చెందిన దిగ్గజ పరిశ్రమలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న స్పేస్, డ్రోన్ సిటీలలో పెట్టుబడులు పెట్టడానికి కూడా జేఎస్‌డబ్ల్యూ సంస్థ ముందుకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
రాయలసీమ వనరులను ఇక్కడి ప్రాంత ప్రగతి కోసమే ఉపయోగించాలని సీఎం స్పష్టం చేశారు. స్థానికంగా లభించే ముడిసరుకును ఉపయోగించి ఇక్కడే ఇనుము తయారు చేయాలని, అలాగే ఇక్కడ స్థాపించే పరిశ్రమలలో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఉద్యానవన పంటల అండతో రాయలసీమలోని లింగాల మండలం రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతంగా అవతరించిందని సీఎం కొనియాడారు. ఆగస్టు 15 నాటికి మదనపల్లిలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' కు శంకుస్థాపన చేస్తామని, అలాగే కడప జిల్లాలోని గండికోటను అమెరికాలోని ‘గ్రాండ్ కేన్యాన్’ కు పోటీగా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే ఎన్నో సమస్యలను పరిష్కరించి, నేడు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిందని చెప్పారు.
గతంలో 2007వ సంవత్సరంలో కొంతమంది స్వార్థపరులు తమ సొంత ప్రయోజనాల కోసం ‘బ్రాహ్మణి స్టీల్స్’ పేరిట 14,000 ఎకరాల భూములను కేటాయించి ప్రజల్లో అబద్ధపు ఆశలు కల్పించారని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండానే.. కడప జిల్లా వాసిగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కడప జిల్లాకు గానీ, రాయలసీమ ప్రాంతానికి గానీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గత పాలకులు రాయలసీమలో కనీసం ఒక్క ఎకరానైనా కొత్తగా సాగునీటి పరిధిలోకి తీసుకురాలేకపోయారని ఆరోపించారు.
వైసీపీది విశ్వసనీయత లేని పార్టీ అని, అది ఎల్లప్పుడూ ‘విధ్వంసకర రాజకీయాన్నే’ నమ్ముకుందని చంద్రబాబు విమర్శించారు. రాజధాని అంశంపై జగన్ వైఖరిని ఎండగడుతూ.. నిన్న గాక మొన్న రాజధానిగా మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం) అని ప్రచారం చేశారు, ఈరోజు చూస్తే మళ్లీ విజయవాడ అంటున్నారు. మానసిక వికలాంగుల్లా కొందరు రాజకీయం చేస్తున్నారు. మూడు రాజధానుల ముసుగులో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని జూదంగా మార్చిందని ఘాటుగా విమర్శించారు. విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని వైసీపీ కుల రాజకీయం చేస్తోందని, కానీ పోలీసులు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం సాయం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెస్తూ.. ఆ పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 11,440 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని తీసుకువచ్చి ఆదుకున్నామని సీఎం గుర్తుచేశారు. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలలోనే ఈ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ.. సరిగ్గా రెండేళ్ల తర్వాత తానే మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్‌ను స్వయంగా ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
