
ఏపీలో పారిశ్రామిక విప్లవం..38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో సోమవారం నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా పలు కీలక నిర్ణయాలు, భారీ పెట్టుబడుల ఒప్పందాలను సీఎం ప్రకటించారు.
38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను మరింత సులభతరం చేసేందుకు ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రభుత్వం ప్లగ్-అండ్-ప్లే, మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 38 సరికొత్త ఎంఎస్ఏంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మొదటి, రెండు దశల్లో భాగంగా 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనలు జరిగాయని వాటిలో కొన్నింటిని విజయవంతంగా ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.
మెటా, అమెజాన్, జోహోలతో కీలక ఒప్పందాలు
రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, మార్కెట్ అవకాశాలను కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ, ఈ-కామర్స్ దిగ్గజాలైన మెటా, అమెజాన్, జోహో వంటి సంస్థలతో ఈ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి స్థానిక వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ లూప్‌లను అనుసంధానించడం సులువవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
గ్రామీణ వికాసం.. రూ.200 కోట్ల నిధుల విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక ఉపాధిని మెరుగుపరిచేందుకు 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలలో రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్, స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇవి గ్రామీణ యువతను, పారిశ్రామికవేత్తలను ఎంతగానో ప్రోత్సహించనున్నాయి. దీనితో పాటు, రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల (ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు) ఏర్పాటు కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ 'పీఎం విశ్వకర్మ' పథకం లబ్ధిదారులు, ప్రభుత్వ విధాన నిర్ణేతలు, వివిధ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులతో కలిపి దాదాపు 1,500 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సరికొత్త ఊతం ఇవ్వనున్నాయి.
