
జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. కులమతాలకు అతీతంగా, పేద ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపుతో పాటు, మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.లక్ష కోట్లకు పెంచుతామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
